లోన్ యాప్ వేధింపులకు ఇబ్రహీంపట్నంలో యువకుడు బలి

లోన్ యాప్ వేధింపులకు ఇబ్రహీంపట్నంలో  యువకుడు బలి

లోన్ యాప్ వేధింపులతో యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన దుర్ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామానికి చెందిన అచ్చన నవీన్ (25) సోమవారం (నవంబర్ 24)  ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇబ్రహీంపట్నం సీఐ మహెందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రిలో జాబ్ చేసే అచ్చన నవీన్ ఆన్ లైన్ యాప్ లో 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు. లోన్ కట్టకపోవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి.  పలు ఫోన్ కాల్స్, మెసేజ్ లు తరుచుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఒత్తిడికి లోనైన నవీన్.. ఇంటా బయట  తెలిస్తే పరువుపోతుందనే భయంతో సూసైడ్ చేసుకున్నాడు. 

మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.