ఆర్టీసీకి దసరా రష్ .. సొంతూళ్లకు వెళుతున్న పబ్లిక్

ఆర్టీసీకి దసరా రష్ .. సొంతూళ్లకు వెళుతున్న పబ్లిక్
  • బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిట
  • మూడ్రోజుల్లో 2,500 బస్సులు నడిపిన ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు: దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా జంట నగరాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్ తదితర ప్రాంతాలు పబ్లిక్‌‌తో కిటకిటలాడుతున్నాయి. పండుగ నేపథ్యంలో టీఎస్‌‌ ఆర్టీసీ 5,265 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా అధికారులను నియమించింది.

గత మూడ్రోజుల నుంచి ప్రయాణికుల రద్దీ అధికంగా ఉందని ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీవన్ ప్రసాద్ తెలిపారు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌‌ నగర్ రూట్లలో ఎక్కువ రద్దీ నెలకొందని వెల్లడించారు. ఈ మూడ్రోజుల్లో 2,500 బస్సులు నడిపామన్నారు. బస్టాండుల్లో ప్యాసింజర్లు ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రద్దీ ఎక్కువగాఉంటే వెంటనే బస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

రైల్వే స్టేషన్లు సైతం..

దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రత్యేక రైళ్లను నడపుతోంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను మరికొన్ని రోజులు పొడిగించింది. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో తీవ్ర రద్దీ నెలకొంది. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం మీదుగా గుంటూరు వెళ్లే ట్రైన్స్‌‌లో రష్ నెలకొంది. కొన్ని ట్రైన్లను జనరల్ బోగీలతోనే నడిపిస్తున్నారు.