రాజీవ్ స్వగృహ ఇండ్లు కొనేందుకు జనం ముందుకొస్తలే

రాజీవ్ స్వగృహ ఇండ్లు కొనేందుకు జనం ముందుకొస్తలే

హైదరాబాద్ : బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ అపార్ట్‌‌మెంట్లలోని ఫ్లాట్లు కొనేందుకు జనం ముందుకు రావటం లేదు. ఫ్లాట్ల అమ్మకం ద్వారా మొత్తం రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గతంలో 3,716 ఇండ్లను లాటరీలో ప్రజలు దక్కించుకోగా.. 1,516 మంది మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా వాళ్లు ఫ్లాట్ వచ్చినా కొనటానికి ముందుకు రాలేదు. డీడీలు కట్టలేదు. దీంతో గతంలో అప్లై చేసుకొని, లాటరీలో ఫ్లాట్ రాని వాళ్లకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. టోకెన్ అమౌంట్ చెల్లించాలని ఈనెల 1న హెచ్ఎండీఏ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. 3 బీహెచ్​కే డీలక్స్, 3 బీహెచ్​కేకి రూ.3 లక్షలు, 2 బీహెచ్​కేకి రూ.2 లక్షలు, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లకు రూ.1 లక్ష చొప్పున బుధవారం సాయంత్రం కల్లా డీడీ తీసి కట్టాలని నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం, ధర, ఫ్లోర్ వివరాలను హెచ్ఎండీఏ వెబ్‌‌సైట్‌‌లో ఉంచారు.

3 బీహెచ్‌‌కే వైపే మొగ్గు

బండ్లగూడలో 1,219, పోచారంలో 981 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి మంగళవారం సాయంత్రం వరకు 950 మంది డీడీలు కట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఫ్లాట్లు ఉన్న సంఖ్యకు సమానంగా కూడా డీడీలు రాకపోవటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీటిలో కూడా ఎక్కువ శాతం 3 బీహెచ్​కే డీలక్స్, 3 బీహెచ్​కే ఇండ్లకే టోకెన్ అమౌంట్ కట్టినట్లు అధికారులు చెబుతున్నారు. బండ్లగూడలో 3 బీహెచ్​కే డీలక్స్, 3 బీహెచ్​కే ఫ్లాట్ రూ.40 లక్షలకే వస్తుండటంతో ఎక్కువ మంది వీటికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌‌లో రూ.1 కోటి ఉండటంతో తక్కువ ధరకు వస్తుందని జనం ఆసక్తి చూపుతున్నారు. దీపావళి సందర్భంగా బ్యాంకులకు వరుసగా సెలవులు రావటంతో టోకెన్‌‌ కట్టేందుకు గడవును మరో 15 రోజులు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బుధవారం అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త గడువు తర్వాత కూడా ఫ్లాట్ తీసుకునేందుకు జనం ముందుకు రాకపోతే టోకెన్ అమౌంట్ కట్టిన వారందరికీ లాటరీ తీయకుండానే ఫ్లాట్‌‌ను అలాట్ చేసే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తు, ఇతర సమస్యలతోనే వెనుకడుగు...

లాటరీలో ఇండ్లను దక్కించుకున్న వాళ్లు.. తర్వాత ఫ్లాట్లను వదులుకోవడానికి ఇండ్ల వాస్తుతో పాటు వాటి నిర్మాణం విషయంలో జనం సంతృప్తి చెందకపోవడమే ప్రధాన కారణాలు. కొన్ని ఫ్లాట్లకు వెంటిలేషన్​, ఇతర సౌకర్యాలు లేవని అంటున్నారు. లోన్లు రాకపోవడమూ ఓ కారణమని అధికారులు అంటున్నారు. అన్నీ నచ్చిన వారు మాత్రం మొత్తం డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. జూన్‌‌లో నిర్వహించిన లాటరీలో పాల్గొనేందుకు అన్ని రకాల ఫ్లాట్లకి సంబంధించి రూ.వెయ్యి డీడీ తీసి అప్లయ్ చేస్తే సరిపోయేది. లాటరీలో ఇల్లు రాకపోతే రూ.వెయ్యి మాత్రమే పోయేవి. కానీ ఇప్పుడు లక్కీడ్రాలో పాల్గొనాలంటే మాత్రం సింగిల్ బెడ్రూంకు రూ.లక్ష, డబుల్ బెడ్ రూం ఇంటికి రూ.2 లక్షలు, ట్రిపుల్ బెడ్ రూం ఇంటికి రూ.3 లక్షల డీడీలను హెచ్ఎండీఏ పేరుతో తీసి హౌసింగ్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంది. లక్కీ డ్రాలో ఎంపికైనా వాళ్లు ఇంటిని కొనుగోలు చేయకపోతే.. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వరు. ఈ కారణం వల్ల కూడా చాలా మంది లాటరీలో పాల్గొనేందుకు ముందుకురాలేదు. తాము గతంలో వదులుకున్న ఇల్లు లాంటిది లేదా వాస్తు సరిగ్గా లేనిది తిరిగి తమకు వస్తే ఎలా అనే అనుమానంతో లాటరీకి దూరంగా ఉంటున్నారు.