హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు, వరదల బీభత్సం : విద్యాసంస్థలు బంద్.. రెడ్ అలర్ట్ జారీ

హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు, వరదల బీభత్సం :  విద్యాసంస్థలు బంద్.. రెడ్ అలర్ట్ జారీ

భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌ అతలాకుతలమవుతోంది. కుండపోత వర్షాలు ఉత్తరాదిన జల ప్రళయాన్ని సృష్టించాయి. వర్షాలకు తోడు అకస్మిక వరదలు పోటెత్తడంతో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. వందల కోట్లలో ఆస్తినష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడి దాదాపు 50మందికి పైగా మృతిచెందారని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కొండల్లో నుంచి వచ్చిన వరద నీటితో పాటు కొట్టుకువచ్చిన బురద, మట్టితో వందలాది ఇండ్లు నేలమట్టం అయ్యాయి. చూస్తుండగానే చాలా ఇండ్లు కూలిపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల కొండచరియలు పేకమేడల్లా విరిగిపడుతున్నాయి.

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు సీఎం  సుఖ్వీందర్ సింగ్ ప్రకటించారు.

వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను దూరంగా వెళ్లాలని కోరారు. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర పర్యటనను టూరిస్టులు వాయిదా వేసుకోవాలని సూచించారు.  

మరోవైపు వర్షాలతో అల్లకల్లోమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.