
ఇల్లందకుంట, వెలుగు: దళితబంధు పథకం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామస్తులు శుక్రవారం ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్ ఎదుట వారి గోడును వెళ్లబోసుకున్నారు. కొందరు నేతలు వారికి అనుకూలంగా ఉన్నవారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి యూనిట్లు అందజేస్తున్నారని ఆరోపించారు. క్లస్టర్ అధికారి, ఇతర సిబ్బందిని తమ యూనిట్ గురించి అడిగితే ఎంపీపీ చెబితేనే ఫైల్ పంపిస్తామని చెబుతున్నారని వాపోయారు. ఎంపీపీ భర్త తీరును ఎండగట్టారు. తాము రెండు నెలలుగా ఎంపిక చేసుకున్న దళితబంధు యూనిట్ల కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చినవారికే యూనిట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆందోళనకారులతో ఫోన్లో మాట్లాడారు. అందరికీ పథకం వర్తింప చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.