
- కర్నాటక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల
హైదరాబాద్, వెలుగు:
బీజేపీ మత రాజకీయాలకు, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు కర్నాటక ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు లాంటివని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. ప్రజలను అమాయకులను చేసి, స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఇలాంటి తీర్పే వస్తుందని ఆదివారం ట్వీట్ చేశారు. కులం, మతం, డబ్బు, అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరని చెప్పారు. నియంత పాలనను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. ‘‘2004 మే 14.. తెలుగు ప్రజల సంక్షేమానికి సువర్ణ అధ్యాయం. వైఎస్ఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన రోజు. ప్రజా సంక్షేమాన్ని పరమావధిగా, రైతు రాజ్యమే అభివృద్ధి, సంక్షేమంగా పనిచేశారు. 5 ఏళ్లలో పాలనతో తెలుగు ప్రజల జీవితాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన లీడర్. మరణం లేని మహానాయకుడు” అని షర్మిల మరో ట్వీట్ చేశారు.
పొత్తులపై వస్తున్న వార్తలన్నీ పుకార్లే
కొన్ని రోజులుగా పత్రికలు, టీవీ చానళ్లు, కొన్ని యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా పేజీల్లో వైఎస్ఆర్‌టీపీపై, షర్మిలపై నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారని, 5 సీట్లకు షర్మిల అంగీకరించారని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ ప్రణాళికలు, రోడ్ మ్యాప్‌లు తామే మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.