
- సడలింపు టైం పెంచండి
- సీఎం కేసీఆర్‌కు జనం వినతులు
- 4 గంటల్లో గుంపులుగా బయటికొచ్చి ఆగం అయితున్నరు
- ఉదయం 6 నుంచి 12 దాకా పెట్టాలని సూచనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న 4 గంటల సమయం సరిపోవట్లేదని, మధ్యాహ్నం 12 గంటలవరకైనా పెంచాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తున్నారు. సడలింపు సమయం తక్కువగా ఉండటంతో ప్రజలంతా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని, లాక్‌డౌన్ లక్ష్యం నెరవేరట్లేదని పేర్కొంటున్నారు.
టైం సరిపోక ఆగమాగమైతున్నరు
ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లోకి రాగా.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చింది. కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు, మాల్స్, మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ 4 గంటల టైంలోనే జనం ఒక్కసారిగా బయటకు వస్తుండటంతో దుకాణాలు, మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. అనేక చోట్ల గుమిగూడుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు. మాస్కులు సరిగా పెట్టుకోవట్లేదు. ఒకరి మీద ఒకరు పడి తోసుకుంటున్నారు. దీంతో వైరస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. లాక్‌డౌన్ ఉద్దేశం నీరుగారిపోతోందని జనం పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ సడలింపు మరో రెండు గంటలు పొడిగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
లాక్‌డౌన్ పొడిగింపుతో ఇబ్బందులు
లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై జనాల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లాక్డౌన్తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ సోషల్ మీడియాలో కేసీఆర్, కేటీఆర్ అకౌంట్లలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగాలు పోయి రోడ్డున పడుతున్నామని, తిండి లేక ఆకలితో అలమటిస్తున్నామని, కుటుంబం గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.