ఆణిముత్యాన్ని వివాదంలోకి లాగొద్దు: రాహుల్

ఆణిముత్యాన్ని వివాదంలోకి లాగొద్దు: రాహుల్

ముంబై: గాయం నుంచి కోలుకున్న అనంతరం ప్రైవేట్‌‌గా రిహాబిలిటేషన్‌‌, ట్రెయినింగ్‌‌ తీసుకున్న స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా సొంత తెలివి ప్రదర్శించలేదని, సంబంధిత వ్యక్తులు చెప్పినట్టుగానే నడుచుకున్నాడని తెలుస్తోంది. సెప్టెంబర్‌‌లో గాయానికి గురైన బుమ్రా ఇంగ్లండ్‌‌ వెళ్లి స్పెషలిస్ట్‌‌లను కలవడం నుంచి రిహాబిలిటేషన్‌‌లో భాగంగా రికవరీ, కండిషనింగ్‌‌, స్ట్రెంత్‌‌ ట్రైనింగ్‌‌తో పాటు నెట్స్‌‌లో బౌలింగ్‌‌ చేసే వరకూ అంతా ఓ ప్రణాళిక ప్రకారమే జరిగిందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ‘బుమ్రా ఏ దశలోనూ సొంతంగా నడుచుకోలేదు. విశాఖపట్నంలో నెట్స్‌‌కు హాజరుకావాలంటే వచ్చాడు. అక్కడి నుంచి బెంగళూరులోని ఎన్‌‌సీఏకు వెళ్లమంటే వెళ్లాడు. తాము ఫిట్‌‌నెస్‌‌ టెస్టు నిర్వహించమని చెప్పిన ఎన్‌‌సీఏ అతడిని తిరిగి ముంబై వెళ్లమన్నది. బుమ్రా అదే పని చేశాడు. ఈ నిర్ణయాలన్నీ అతనివి కావు. మరి అతను ముందుగానే ఎన్‌‌సీఏకు ఎందుకు రాలేదు అని అడిగితే దానికి సమాధానం చెప్పాల్సింది బీసీసీఐనే. ఎందుకంటే అది బుమ్రా నిర్ణయం కాదు. ఒక ప్లేయర్‌‌గా తనకు వచ్చిన సూచనల మేరకు అతను నడుచుకున్నాడు. అయినప్పటికీ ఎన్‌‌సీఏ అతనికి ఫిట్‌‌నెస్‌‌ టెస్టు నిర్వహించకూడదని ద్రవిడ్‌‌ భావిస్తే అదే విషయాన్ని బోర్డుకు తెలపాలి. ఏదేమైనా బుమ్రా పూర్తిగా కోలుకొని, రీఎంట్రీకి రెడీ అవడం టీమిండియాకు శుభవార్త. ఈ వివాదంలోకి అతడిని తీసుకురాకూడదు. ఇండియా క్రికెట్‌‌కు అతనో ఆణిముత్యం. అలాంటి ప్లేయర్‌‌ విషయంలో సంబంధిత వ్యక్తులు తమ ఇగోలు పక్కనబెట్టి బాగా ఆడేందుకు సహకరించాలి కానీ, వివాదం సృష్టించకూడద’ని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.