పరిగి ఎమ్మెల్యే పల్లెబాటలో అడుగడుగునా నిరసనలు

పరిగి ఎమ్మెల్యే పల్లెబాటలో అడుగడుగునా నిరసనలు
  • పలు గ్రామాల్లో కొప్పుల మహేశ్​రెడ్డిని అడ్డుకొని ప్రశ్నించిన జనం
  • రాజకీయ కుట్రేనని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే వర్గం

పరిగి, వెలుగు: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సెగ్మెంట్​లో చేపట్టిన పల్లె బాట కార్యక్రమంలో పలు చోట్ల ఆయనకు నిరసన ఎదురైంది. ఎమ్మెల్యేను అడ్డుకొని ఆయా గ్రామాల ప్రజలు పలు అంశాలపై ప్రశ్నించారు. అయితే, ఇదంతా రాజకీయ కుట్రేనని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. పరిగి సెగ్మెంట్​ లోని రాపోల్, సయ్యద్​పల్లి, కండ్లపల్లి, మన్నెగూడతో పాటు పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి పల్లెబాట కార్యక్రమం చేపట్టగా పలు చోట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. రైతుల రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ, రోడ్డు సమస్యలు, తాగునీరు, కమ్యూనిటీ హాల్స్, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఎమ్మెల్యేను నిలదీశారు. ఐదారు దఫాలుగా మీ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉన్నారని, కానీ నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని గ్రామస్తుల్లో కొందరు  ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే, కావాలనే కొందరు కుట్ర పన్ని గ్రామస్తులతో కలిసి అడ్డుకున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. తమ నేతకు పార్టీ టికెట్ రాకుండా స్థానిక బీఆర్​ఎస్​నేత మనోహర్ రెడ్డి వర్గం తీవ్రంగా కృషి చేస్తోందని ఆరోపిస్తోంది. ప్రతి గ్రామంలో ఒక గ్రూపును ఏర్పాటు చేసుకొని పల్లె బాట కార్యక్రమాన్ని సజావుగా సాగకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందని ఎమ్మెల్యే అనుచరులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే, మనోహర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ముఖ్య నేతలు, కార్యకర్తలతో టచ్​లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.