ఎటు పోవాల్నో తెల్వక ఆగమాగం

ఎటు పోవాల్నో తెల్వక ఆగమాగం

హైదరాబాద్, వెలుగు:సర్కార్ దవాఖానలకు వస్తున్న పేషెంట్లు, అటెండెంట్లకు వైద్యం కోసం ఎటు పోవాలో తెలియక ఆగమాగం అవుతున్నారు. అటు పోతే ఇటు పోండని, ఇటు పోతే అటు పోండని తిప్పుతున్నారు. ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వచ్చి పడరాని పాట్లు పడుతున్నారు. ఫస్ట్ టైం వచ్చినోళ్లు మరింత ఇబ్బంది పడుతున్నారు. సమాచారం ఇచ్చేందుకు కొన్నిచోట్ల హెల్ప్ డెస్కులు లేకపోవడం, ఉన్నచోట సిబ్బంది ఉండకపోవడంతో పేషెంట్లు, వారి అటెండెంట్లు కనిపించిన ప్రతిఒక్కరినీ అడుగుతూ పోతున్నారు. అడ్మిట్​అయిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. ఏ టెస్టులు కావాలన్నా బంధువులను వెంట పెట్టుకుని వెళ్తున్నారు. ఏ టెస్టు ఎక్కడ చేస్తారో తెలియక హాస్పిటల్ మొత్తం తిరుగుతున్నారు. బ్లడ్, యూరిన్​ టెస్టుల కోసం వార్డుల్లోని నర్సులు శాంపిల్స్ ​తీసి పేషెంట్ల సహాయకులకు ఇస్తున్నారు. ఓ రూమ్ నంబర్ ​చెప్పి ల్యాబ్​లో ఇచ్చి రావాలని పంపుతున్నారు. ఆ ల్యాబ్ ఎక్కడ ఉంటుందో వివరంగా చెప్పకపోతుండడంతో అటెండెంట్లు గంటల తరబడి శాంపిల్స్​పట్టుకుని తిరుగుతున్నారు. సిటీలోని అన్ని సర్కార్​దవాఖానల్లో ఇదే పరిస్థితి అని బాధితులు వాపోతున్నారు. 

స్వచ్ఛంద సంస్థలతో సరి..
కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్​లో సమాచారం ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. గాంధీ,ఉస్మానియాలో ఓపీ ఇచ్చే టైంలో మాత్రమే ఈ సంస్థల సిబ్బంది ఉంటున్నారు.మిగిలిన టైంలో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు.మిగతా చోట వాటి ఊసే లేదు. ప్రభుత్వం హెల్ప్​ డెస్కులతో పాటు అన్ని చోట్లా ట్రీట్ మెంట్ పొందుతున్న పేషెంట్ల కోసం వార్డు బాయ్ ఉండేలా చూడాల్సిన అవసరముంది.వాళ్లు ఉంటే పేషెంట్లను టెస్టులకు తీసుకుపోతారు. 

తిరగలేకపోతున్నం..
సర్కారు హాస్పిటల్స్​లో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. నేను 15 ఏండ్లుగా నిమ్స్​కు వస్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏం మారలేదు. ఎలాంటి టెస్టులు చేయించాలన్నా పేషెంట్లను వెంట పెట్టుకుని ఆడికీ.. ఈడికీ తిరగాల్సిన పరిస్థితి. టెస్టులు చేసేచోట పైసలు పెట్టంది పని జరగట్లేదు. కనీసం సరైన సమాచారం ఇచ్చేవారు ఉండట్లేదు. ప్రతి బిల్డింగులో హెల్ప్​ డెస్క్ పెట్టాలి.
- గోపాల్, పేషెంట్ బంధువు, మంథని


నిండు గర్భిణితో గంట తిరిగిన..
డెలివరీ కోసం మా బిడ్డను నిలోఫర్ హాస్పిటల్​లో అడ్మిట్ చేసినం. యూరిన్​ టెస్ట్ ​కోసం శాంపిల్​ ఇచ్చి రమ్మన్నారు. అక్కడి ఇక్కడ అంటున్నారు.. ఇక్కడ అడిగితే అక్కడ అంటున్నారు. శాంపిల్ ఇచ్చేందుకు నిండు గర్భిణితో గంట పాటు అటూ ఇటూ తిరిగినం.

- మహబూబి, జహీరాబాద్

నిమ్స్ హాస్పిటల్​లోని ఎమర్జెన్సీ వార్డుకు వస్తున్న పేషెంట్ల బ్లడ్ ​శాంపిల్​ తీసుకుంటున్న సిబ్బంది దాన్ని నేరుగా అటెండెంట్ చేతిలో పెట్టి రెండో అంతస్తులో ఇచ్చి రమ్మంటున్నారు. తెలిసిన వారు నేరుగా వెళ్తుండగా, తెలియని వారు అటూ.. ఇటూ తిరుగుతున్నారు. అక్కడి నుంచి బ్లడ్ రిపోర్ట్ వచ్చేంత వరకు పేషెంట్​కు చికిత్స మొదలుకాని పరిస్థితి. ఎమర్జెన్సీ లోనే ఇలా ఉంటే ఇక ఇన్ పేషెంట్, ఓపీలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అవి కరోనాతోనే క్లోజ్..
కరోనాకు ముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్కులు ఉండేవి కాదు. కరోనా టైంలో పేషెంట్ల వివరాలు బయట ఉండే సహాయకులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేశారు. అది కూడా కోర్టు పలుమార్లు హెచ్చరించడంతో ఆఫీసర్లలో కదలిక వచ్చి పెట్టారు. వాటిలో సమాచారం ఇచ్చేందుకు పోలీసులను కూడా నియమించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్నిచోట్ల హెల్ప్ డెస్కులు మాయం అయ్యాయి. ఒకటి, రెండు హాస్పిటల్స్​ మినహా ఎక్కడా లేవు. దీంతో హాస్పిటల్స్ కి వస్తున్న వారు ఎక్కడికి పోతే ట్రీట్ మెంట్​ అందుతుందో తెలియని పరిస్థితి ఉంది. నిమ్స్ ​లాంటి పెద్దాసుపత్రుల్లో అయితే ఒక్కో ఓపీ బిల్డింగ్ ఒక్కో దగ్గర ఉంటుంది. ఇలాంటి చోట సమాచారం ఇచ్చేందుకు ఎవరూ లేకపోవడంతో పేషెంట్ల టైం మొత్తం తిరగడంలోనే పోతోంది. ఓపీ కోసం గంటలపాటు క్యూలో నిల్చొని కౌంటర్ దగ్గరకు వచ్చాక ఈ వ్యాధికి ఇక్కడ ఓపీ ఇవ్వరు, మరో బిల్డింగ్​కు వెళ్లాలని చెబుతుండడంతో పేషెంట్లు, వారి సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.