ఆరు నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్​కు ఓట్లేస్తరు: హరీశ్​రావు

ఆరు నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్​కు ఓట్లేస్తరు: హరీశ్​రావు

 

  •     ఆ పార్టీ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు మొదలైనయ్
  •     రేవంత్ కు సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని కామెంట్ 

మెదక్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నదని.. ఏవి పాలో, ఏవి నీళ్లో జనానికి తెలిసిపోయిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ‘‘ఆరు నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్ కు ఓట్లేస్తారు. ఇప్పుడు నెల పదిహేను రోజులు, రెండు నెలలే అయింది. ఆరు నెలలు ఆగని సర్పంచ్, ఎంపీటీసీ, ఎలక్షన్లు వస్తే.. బీఆర్ఎస్ నేతలను జనమే దొర్కవట్టుకుని ఓట్లేస్తారు” అని చెప్పారు. ఆదివారం మెదక్ లోని వైస్రాయ్ గార్డెన్​లో జరిగిన మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. రేవంత్‌‌‌‌కు సీఎం కుర్చీ కేసీఆర్ బెట్టిన భిక్ష​అని, కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తేవడం వల్లనే రేవంత్​కు ఇప్పుడు సీఎం పదవి దక్కిందని ఆయన అన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన రేవంత్..​ సీఎం పదవిని కించపరుస్తున్నారని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నదని, దీనిపై సోషల్​మీడియాలో ఎండగట్టాలని పార్టీ క్యాడర్​కు​పిలుపునిచ్చారు. ‘‘అధికారంలోకి వస్తే డిసెంబర్​ 9న రూ.2 లక్షల రుణమాఫీపై సంతకం చేస్తామని కాంగ్రెసోళ్లు హామీ ఇచ్చారు. వడ్లకు రూ.500 బోనస్, పింఛన్​ రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నా హామీలేవీ అమలు చేయడం లేదు. ఆరు గ్యారంటీల గడువు మార్చి 17 వరకు ఉంది. ఆలోపు హామీలు అమలు చేస్తేనే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేస్తారు. లేకుంటే కర్రుకాల్చి వాత పెడతారు” అని అన్నారు. 

ఇన్వర్టర్లు, జనరేటర్ల బిజినెస్ పెరిగింది.. 

కాంగ్రెస్​ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతుంటే.. అసహనంతో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయని అన్నారు. ‘‘24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తామని కాంగ్రెసోళ్లు చెప్పారు. కానీ 14–16 గంటలకు మించి రావడం లేదు. బోరు మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంద్​అయిన మోటర్​వైండింగ్, ట్రాన్స్​ఫార్మర్​ రిపేరింగ్​బిజినెస్, ఇన్వర్టర్లు, జనరేటర్ల వ్యాపారం ఇప్పుడు పెరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు” అని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లో బీఆర్ఎస్​ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.