హెల్త్ అలర్ట్ : ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకు.. కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువ

హెల్త్ అలర్ట్ : ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకు.. కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువ

కరోనా ఇన్ఫెక్షన్ కు బ్లడ్ గ్రూపులు కూడా కారణమవుతాయని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. కొవిడ్-19కి కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్‌ వల్ల పలు బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి అధిక ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది. A బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులకు కరోనా వైరస్ సోకే ఛాన్స్ ఎక్కువని తేల్చింది. O బ్లడ్ గ్రూపు ఉన్నవారికి ఈ ప్రమాదం కొంత తక్కువేనని ప్రకటించింది.

వైరస్‌ నివారణలో భాగంగా చైనా కరోనా బాధితుల శరీరంలో చోటుచేసుకున్న ప్రతి అంశాన్ని అధ్యయనం నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా ఉహాన్, షెంజహెన్ నగరాల్లో చికిత్స పొందుతున్న 2000 మంది కరోనా బాధితుల రక్త నమూనాలు సేకరించింది. వాటితోపాటు ఆయా నగరాల్లో వైరస్ సోకకుండా ఆరోగ్యం ఉన్న వ్యక్తుల రక్త నమూనాలను కూడా తీసుకుంది. ఈ సందర్భంగా ‘O’ గ్రూప్ వ్యక్తులు కరోనా వైరస్‌ను ఎదుర్కోగలుగుతున్నారని తెలుసుకున్నారు. ‘A’ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. తమకు వచ్చిన బాధితుల్లో ఎక్కువ మంది ‘A’ బ్లడ్ గ్రూప్ కలిగినవాళ్లే ఉన్నారని తెలిపారు. వీరికి ఇన్ఫెక్షన్ వేగంగా సోకడమే కాకుండా తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

బ్లడ్ గ్రూప్ O కణాలతో పోల్చినప్పుడు బ్లడ్ గ్రూప్ A కణాలు SARS-CoV-2 బారిన పడే అవకాశం ఉందని డాక్లర్లు కూడా చెబుతున్నారు. కరోనా వేరియంట్లు సోకడానికి కూడా వీరికే ఎక్కువ అవకాశముందని అంటున్నారు. O బ్లడ్ గ్రూప్ ఉన్న వారితో పోలిస్తే A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కరోనా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం 20 శాతం ఎక్కువని ఈ అధ్యయనం తెలిపింది. అలా అని O బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి వ్యాధి సోకదనేం కాదు. వారికి కూడా వ్యాపిస్తుంది. కాకపోతే A బ్లడ్ గ్రూప్ వారితో పోలిస్తే కాస్త తక్కువ. దీన్ని నివారించేందుకు కరోనా టీకా, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.