ఊరూరా బహుజన బతుకమ్మ

ఊరూరా బహుజన బతుకమ్మ

తెలంగాణ ఏర్పడి పదేండ్లు కావస్తున్నది. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడంలేదు. పైగా విద్య, ఉపాధి కల్పన ద్వారా నవ తెలంగాణ నిర్మాణానికి పాటు పడాల్సిన ప్రభుత్వం యువతను లిక్కర్​కు బానిసలుగా చేసి, రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నది. ఒకప్పుడు ఏటా రూ.3 వేల కోట్ల ఎక్సైజ్‌‌‌‌ ఆదాయముంటే, ఇవాళ రూ.40 వేల కోట్లు కేవలం లిక్కర్​ అమ్మకాల ద్వారా వస్తున్నది.

ఊరూరా బెల్టుషాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్నది. ప్రాజెక్టుల ద్వారా పంటల దిగుబడి పెరిగిందని సర్కారు చెప్తున్నా ఉత్పత్తి సంపదనంతా తాగుడుకు తగలేయడం ఏ రకమైన అభివృద్ధో ఈ ప్రభుత్వమే చెప్పాలి. ఈసారి మద్యపానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో బహుజన బతుకమ్మ నిర్వహిస్తున్నాం. మద్యం వ్యతిరేక పూల కవాతుగా–స్త్రీల కవాతుగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు గన్‌‌‌‌పార్క్‌‌‌‌లో నివాళి, మధ్యాహ్నం రెండు గంటలకు ఉస్మానియా ఆర్ట్స్‌‌‌‌ కాలేజ్‌‌‌‌ ముందు ఆటా పాటా నిర్వహించాం.

నేడు బోడుప్పల్‌‌‌‌లో, 15న గోదావరిఖని సెంటినరీ కాలనీలో, 16న రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో, 17న రంగారెడ్డి జిల్లా రావులపల్లిలో, 18న వికారాబాద్‌‌‌‌ జిల్లా రేగడి మైలారంలో, 19న జనగాం జిల్లా బమ్మెరలో, 20న వేములవాడలో, 21న సూర్యాపేట జిల్లా కేశవాపురంలో, 22న ఖమ్మం జిల్లా ముదిగొండలో బహుజన బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. తమ గ్రామాలను ‘మద్యపాన రహిత గ్రామాలు’గా తీర్చిదిద్దుకుందామంటూ మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాం.

- బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ