పాల్వంచలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చిగురిస్తున్న ఆశలు

పాల్వంచలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై  చిగురిస్తున్న ఆశలు
  • పాల్వంచలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం ప్రైవేట్​ కన్సల్టెన్సీకి బాధ్యతలు
  • పుష్కలంగా నీరు, బొగ్గు వనరులు.. గ్రిడ్​, ట్రాన్స్​పోర్టు, ల్యాండ్​ సౌకర్యాలు

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : విద్యుత్​ ప్లాంట్ల విషయంలో పాల్వంచకు పూర్వ వైభవంపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కూల్చివేసిన పాత ప్లాంట్​స్థలంలో ఒకటి లేదా రెండు అల్ట్రా సూపర్​ క్రిటికల్​థర్మల్​ప్లాంట్ల నిర్మాణాల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం తెలంగాణ జెన్ కో ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఢిల్లీకి చెందిన డిజైన్​ ప్రైవేట్​ లిమిటెడ్​సంస్థకు అప్పగించి, రూ. 4.75 లక్షలను కూడా కేటాయించింది. ప్లాంట్ల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, బొగ్గు, నీటి లభ్యత, ట్రాన్స్​పోర్టుతోపాటు ఇతర వివరాలతో సమగ్ర దర్యాప్తు చేసి నివేదికలను ఇవ్వాలని ఆ సంస్థతో జెన్​కో ఒప్పందం చేసుకుంది. 

800 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్!

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న పాల్వంచ దశాబ్దాల కాలంగా రాష్ట్రానికి వెలుగులను అందిస్తోంది. పాల్వంచలో కాలం చెల్లిన 720 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన పాతప్లాంట్​ అయిన కేటీపీఎస్​ ఓఅండ్​ఎంను ఇటీవల అధికారులు తొలగించారు. ఈ ప్లాంట్​లో పనిచేసే దాదాపు 2వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. వారు కుటుంబాలతో సహా వెళ్లడంతో పాల్వంచ పట్టణం కళ కోల్పోయింది. 

వ్యాపారాలు తగ్గాయి. ఈ క్రమంలో పాత ప్లాంట్​ తొలగించిన ప్రాంతంలో 800 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ను కొత్తగా ఏర్పాటు చేస్తే పాల్వంచకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయని పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో శుభవార్త చెప్తానని గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​ హామీ ఇచ్చారు. కొత్త ప్లాంట్​ కోసం తన వంతు కృషి చేస్తున్నానని అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పేర్కొన్నారు. 

కొత్త థర్మల్​ పవర్​ ప్లాంట్ల ఏర్పాటు కోసం కేంద్రం సహకరించాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి కూడా పార్లమెంట్​ సమావేశాల్లో కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 800మెగావాట్ల థర్మల్​ పవర్​ స్టేషన్​ ఏర్పాటుచేయాలని పలుమార్లు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. ఈ క్రమంలో ప్లాంట్ల నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వనరులు పుష్కలం..

పాల్వంచలో ప్రస్తుతం 5,6 దశల్లో వెయ్యి మెగావాట్లు, ఏడో దశలో 800మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి అవుతోంది. వచ్చే పదేండ్ల కాలంలో 5,6 దశల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్లు మూసివేతకు గురికానున్నాయి. పాల్వంచలో థర్మల్​ విద్యుత్​ ప్లాంట్ల​ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్నాయి. థర్మల్​ విద్యుత్​ పవర్​ ప్లాంట్​ ఏర్పాటులో కీలకమైనది భూ సమస్య. భూ సేకరణ, పరిహారం చెల్లించడంతో పాటు ప్లాంట్​ నిర్మాణం, గ్రిడ్​ లైన్ల ఏర్పాటు, నీళ్ల కోసం కెనాల్స్​ ఏర్పాటుకు రూ. వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 

కానీ పాల్వంచలో విద్యుత్​ ప్లాంట్ల​కు అవసరమైన భూమికి ఢోకాలేదు. పట్టణంలోని కేటీపీఎస్​ లో 720 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ను కాలం చెల్లడంతో ఇటీవల కాకూల్చివేశారు. ఈ స్థానంలో కొత్తగా 800మెగా వాట్ల విద్యుత్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయవచ్చని కార్మికులు పేర్కొంటున్నారు. కిన్నెరసాని నీళ్లు ప్లాంట్​కు పుష్కలంగా సప్లై అవుతున్నాయి.  

విద్యుత్​ ప్లాంట్​కు అవసరమైన బొగ్గును పాల్వంచకు అతి సమీపంలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లోని సింగరేణి బొగ్గు గనుల నుంచి సప్లై చేసుకునే వీలుంది. ఇందుకు అవసరమైన రోడ్డు, రైలు మార్గాలున్నాయి. ఉత్పత్తి చేసిన విద్యుత్​ను అనుసంధానించేందుకు అతి కీలకమైన గ్రిడ్​ లైన్లు ఉన్నాయి. విద్యుత్​ ఉత్పత్తిలో భాగంగా వచ్చే బూడిద కోసం యాష్​ పాండ్స్​ ఉన్నాయి. 

కేటీపీఎస్ విస్తరణకు 13 లేఖలు.. 

పాల్వంచ : భద్రాద్రికొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కొత్త గూడెం ధర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)విస్తరణ సర్వే కు జెన్​కో 4. 5 లక్షలు మంజూరు చేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు తెలిపారు. శనివారం పాల్వంచలోని జెన్ కో గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి పాల్వంచలో కేటీపీఎస్ విస్తరణ జరపాలని తాను 13 లేఖలు రాసినట్లు వివరించారు.

 ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవం త్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశంతో జెన్​కో కేటీపీఎస్ విస్తరణ సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఢిల్లీకి చెందిన డిజైన్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యత అప్పగించిందని తెలిపారు. కేటీపీఎస్ పాత ప్లాంట్ కూల్చివేత అనంతరం సుమారు 450 ఎకరా ల భూమి అందుబాటులో ఉందని, ఈ స్థలంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్లు ఎన్ని నిర్మించవచ్చో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. 

కేటీపీఎస్ లో 720 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ తొలగించినా దాని స్థానంలో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారని, అయితే పని చేసే కార్మికుల సంఖ్య మాత్రం తగ్గిందని వివరించారు. టెక్నాలజీ ఆధారంగా కార్మికుల సంఖ్య ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో కేటీపీఎస్ లో మరో రెండు యూనిట్లు నిర్మిస్తే మ రో 200 ఎకరాల స్థలం అవసరం అవుతుందని, దాని సేకరణకు ఏం చేయవచ్చో అధికారులతో చర్చించారు. ప్లాంట్ల ఏర్పాటుకు  వనరుల  కొరత కూడా లేదన్నారు.