- పారిశ్రామికవేత్తల కోసం వారానికి ఒక రోజు కేటాయిస్తా
- పవర్ కట్స్ లేవు.. నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం
- హైటెక్స్ ఎక్స్‌పోలో డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల లెక్కల కంటే ప్రజల జీవనోపాధికే పెద్దపీట వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన 'ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వ్యాపారాలు సులభంగా చేసుకునే సదుపాయం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనేది కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న పరిశ్రమలకు, మహిళలకు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు కూడా అందాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.
పారిశ్రామికవేత్తల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇకపై ప్రతి శుక్రవారం ఎంఎస్ఎంఈ సంఘాలు, పారిశ్రామిక రంగ ప్రతినిధులతో సమావేశం అవుతానని ప్రకటించారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రపంచ గుర్తింపు పొందినప్పటికీ.. రాష్ట్ర ఆదాయంలో సేవల రంగంతో పాటు తయారీ రంగం, చిన్న పరిశ్రమల వాటా కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
పరిశ్రమలకు పవర్ కట్ సమస్య లేదు
గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో కరెంటు వాడకం 15,000 మెగావాట్ల నుంచి 18,500 మెగావాట్లకు పెరిగినప్పటికీ, ఎక్కడా పవర్ కట్స్ లేకుండా పరిశ్రమలకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2035 నాటికి తెలంగాణలో 34 గిగావాట్ల సోలార్ (సౌర) విద్యుత్ ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అలాగే కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అన్ని రకాల మోడళ్లపై 100 శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. కేవలం ఈవీ వాహనాలను వాడటమే కాకుండా, వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మన రాష్ట్రంలోనే అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
3 ట్రిలియన్ డాలర్లే లక్ష్యం
2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని భట్టి విక్రమార్క చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వ పెట్టుబడులతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌ను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. భవిష్యత్తులో రాబోయే ఫ్యూచర్ సిటీ, మూసీ నది పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) వంటి మెగా ప్రాజెక్టులతో రాష్ట్ర ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాలని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
