కొత్తగూడ ఫ్లైఓవర్‌‌‌‌పై ఘోర రోడ్డు ప్రమాదం

కొత్తగూడ ఫ్లైఓవర్‌‌‌‌పై ఘోర రోడ్డు ప్రమాదం

రాంగ్‌‌రూట్‌‌లో వచ్చిన స్కూటీని ఢీకొట్టిన బుల్లెట్ బైక్
స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌‌‌‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌‌లో వచ్చిన స్కూటీని బుల్లెట్ బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన విట్టల్ (38), విట్టల్ బావమరిది శ్రీకాంత్​(17) అదే గ్రామంలోని చికెన్‌‌ షాప్‌‌లో పనిచేస్తున్నారు. గచ్చిబౌలి, హైటెక్​సిటీ ఏరియాల్లో చికెన్ డెలివరీ ఇవ్వడానికి శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరూ కలిసి పటాన్‌‌చెరు మీదుగా స్కూటీపై బయల్దేరారు.

అల్విన్ జంక్షన్ మీదుగా హైటెక్​సిటీ వైపు వెళ్తున్నారు. అధికారులు ట్రాఫిక్‌‌ను తగ్గించేందుకు ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు కొండాపూర్ ఆర్టీఏ అఫీస్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌‌పై ఒక లైన్‌‌లో గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలకు అనుమతిస్తారు. కానీ.. విట్టల్, శ్రీకాంత్‌‌ ఉదయం సుమారు 7 గంటలకే  కొండాపూర్ ఆర్టీఏ అఫీస్ వద్ద రాంగ్​రూట్‌‌లో ఫ్లైఓవర్ ఎక్కి గచ్చిబౌలి వైపు వెళ్లారు. సరిగ్గా ఏఎంబీ మాల్‌‌, ఎస్‌‌ఎల్‌‌ఎన్‌‌టీ మాల్ మధ్యలో యూ టర్న్ తీసుకుని కొద్దిదూరం వెనక్కి వెళ్లారు.

మళ్లీ యూటర్న్ తీసుకొని గచ్చిబౌలి వైపు వస్తుండగా అదే సమయంలో నైట్ డ్యూటీ ముగించుకుని గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ వైపు బుల్లెట్ బైక్‌‌పై వెళ్తున్న ఐటీ ఉద్యోగి వినోద్ (24) స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న విట్టల్‌‌, శ్రీకాంత్ రోడ్డుపై పడిపోవడంతో తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వినోద్‌‌కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వినోద్‌‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విట్టల్‌‌, శ్రీకాంత్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు విట్టల్ భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.