అడ్డగోలుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ 

అడ్డగోలుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ 
  • ఆగని వానలు..విడువని జ్వరాలు
  • 10 వేలు దాటిన డెంగీ కేసులు 
  • కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
  • అడ్డగోలుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ 
  • డెంగీ నివారణకు చర్యలు చేపట్టని సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం ముగిసినా వానలు, జ్వరాలు జనాలను వదలడం లేదు. వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరాల బారినపడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ దవాఖాన్లన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్లేట్‌‌లెట్స్‌‌ సంఖ్య తగ్గడం కామన్‌‌గా మారిపోయింది. కరోనా ఎఫెక్ట్‌‌తో చాలా మందిని దగ్గు ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. డెంగీ కేసుల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 10 వేలు దాటింది. మలేరియా కేసులు 500 దాటాయి. ఇతర వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే లక్షల్లో ఉంది. రెండేండ్లలో జ్వరాలు ఈ స్థాయిలో విజృంభించలేదు. 2019లో వందల మంది డెంగీతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కూడా జ్వరాల కారణంగా జనం మరణిస్తున్నా సర్కార్ లెక్కల్లోకి మాత్రం అవి ఎక్కడం లేదు. అసలు ఇప్పటి వరకు ఒక్కరు కూడా డెంగీతో మరణించలేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. 

ప్రకటనలతోనే సరి.. 

ఈసారి డెంగీ విజృంభించే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ మొదట్నుంచీ హెచ్చరించినా మున్సిపల్ ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగీ విజృంభించింది. గ్రేటర్ హైదరాబాద్‌‌, ఇతర మున్సిపాలిటీల్లో డెంగీ నివారణకు ఇంటింటి సర్వే చేస్తామని సర్కార్‌‌‌‌ చేసిన ప్రకటన పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. అరకొరగా అక్కడక్కడ మాత్రమే సర్వే జరిగింది. దీనికి తోడు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ట్రీట్‌‌మెంట్ అందడం లేదు. ప్రైవేటు హాస్పిటల్‌‌కు పోతే వేలకు వేలు దోచుకుంటుండడంతో జనాలు ఆర్‌‌‌‌ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కూడా తగ్గకుండా పరిస్థితి విషమించిన తర్వాతే పెద్ద హాస్పిటళ్లకు వెళ్తున్నారు. దీంతో పరిస్థితి ప్రాణాల మీదకు వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 1,350 మంది డాక్టర్లు ఉండాలి. కానీ ఇప్పుడు 700 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. సుమారు 950 డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. దసరాకే వీళ్లంతా ఉద్యోగాల్లోకి ఎక్కుతారని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇంకా రిజల్ట్ కూడా ప్రకటించకపోవడం గమనార్హం.

ఆగని దోపిడీ..

ప్రభుత్వ దవాఖాన్లు సరిపడా లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లక తప్పడం లేదు. మెజారిటీ ప్రైవేటు హాస్పిటళ్లు అడ్డగోలు బిల్లులు వేసి జనాలను దోచుకుంటున్నాయి. రెండ్రోజులు ఆస్పత్రిలో ఉంటే  సగటున రూ.10 వేలు బిల్లు వేస్తున్నారు. ప్లేట్ లెట్స్‌‌ తగ్గిపోయి, కొత్త ప్లేట్‌‌లెట్స్‌‌ ఎక్కించాల్సి వస్తే రూ.30 వేల నుంచి రూ.50 వేలు దండుకుంటున్నారు. ఇక కార్పొరేట్ హాస్పిటళ్లలో అయితే లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. అయినా ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రైవేటు హాస్పిటళ్లపై తనిఖీలు ప్రారంభించినప్పటికీ, అందులో అధిక చార్జీల వసూలుకు సంబంధించి చర్యలు తీసుకోవడం లేదు. రిజిస్ర్టేషన్‌‌, ఇతర నిబంధనలను మాత్రమే అధికారులు పట్టించుకుంటున్నారు. చార్జీల పెరుగుదలపై కంప్లయింట్లు వచ్చినా డీఎంహెచ్‌‌వోలు స్పందించడం లేదని జనం అంటున్నారు.