ఒక్క క్లిక్ తో లోన్ అంటూ చీటింగ్

ఒక్క క్లిక్ తో లోన్ అంటూ చీటింగ్

ఖమ్మం, వెలుగు:  ఇన్​స్టంట్ లోన్, ఒక్క క్లిక్ తో లోన్​మీ సొంతం అంటూ ఊరిస్తారు. డాక్యుమెంట్స్​అవసరం లేదు. సిబిల్​స్కోర్​తో పనిలేదంటూ ఊదరగొడుతారు. ఈ ఆఫర్లకు ఆకర్షితులై వారి ట్రాప్​లో పడ్డామో.. ఇక అంతే సంగతి. వారు పంపిన లింక్​నుంచి యాప్​ లోన్​ డౌన్​లోడ్​ చేసుకుంటే ఇక మీ ఫోన్​మోసగాళ్ల చేతికి చిక్కినట్టే. మీ ఫోన్​లోని కాంటాక్ట్​నంబర్లతో సహా ఫొటోలు, మీ పర్సనల్​డేటా అంతా వారికి చిక్కుతుంది. లోన్​తీసుకొని టైంకు కట్టకున్నా.. లేటు అయినా.. టార్చర్​స్టార్టవుతుంది. ఓ వైపు లోన్​యాప్​ల నుంచి డబ్బులు తీసుకోవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నా, జిల్లాలో ఏదో ఒక చోట బాధితులు బయటపడుతూనే ఉన్నారు. 

యూజర్లు జాగ్రత్తగా ఉండాలె.. 

గూగుల్ ప్లేస్టోర్​లో 600కు పైగా ఇన్​స్టంట్ లోన్​ యాప్​లు ఉన్నాయి. ఇందులో 27 యాప్​లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బ్లాక్​ చేసింది. మరో 137 యాప్​ల లిస్ట్ ను ఆర్బీఐ విడుదల చేసింది. ఆ యాప్​ల పట్ల యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది. ఇక జిల్లాలో పోలీసులు కూడా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సైబర్​ దోస్త్ ద్వారా ఇలాంటి లోన్​ యాప్​లపై ప్రచారం చేస్తున్నారు. ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడే యూజర్​ ఫోన్​కు సంబంధించిన డేటా, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్స్​ను యాక్సెస్​ చేసుకునేలా పర్మిషన్స్​ఇవ్వాల్సి ఉంటుంది. అలా లోన్​ కావాలంటే తప్పనిసరిగా కండిషన్స్​కు ఓకే చెప్పాల్సి రావడం, ఆ తర్వాత లోన్​ తీసుకున్న వారి పాలిట శాపంగా మారుతోంది. లోన్ కట్టకపోయినా, లేట్​అయినా, వారు అడిగినంత చెల్లించకపోయినా వారి టార్చర్​స్టార్ట్​అవుతుంది. లేడీస్​ ఫొటోలను మార్ఫింగ్ చేసి, పోర్న్​ సైట్లలో పెడతామని హెచ్చరిస్తున్నారు. మాట వినని వాళ్ల మార్ఫింగ్ చేసిన అర్ధనగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తున్నారు. అప్పటికే వారి బంధువులు, ఫ్రెండ్స్ కాంటాక్ట్ నంబర్స్​ పంపించి ఇజ్జత్ తీస్తున్నారు. చిన్న అమౌంట్ కోసం లోన్​ యాప్​ల జోలికి వెళ్లొద్దని సైబర్​ క్రైమ్​ పోలీసులు సూచిస్తున్నారు.

లోన్​ చెల్లించినా టార్చర్​ తప్పడం లేదు.. 

లోన్​ డబ్బు తిరిగి చెల్లించినా కూడా యాప్ నిర్వాహకుల నుంచి బాధితులకు వేధింపులు తప్పడం లేదు. దీంతో అప్పటికప్పుడు బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఉపయోగం లేకుండా పోతోంది. గూగుల్ ప్లే స్టోర్​ లో ఉన్న యాప్​ లు చైనాలో తయారైనవి కావడం, నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తుండడంతో వాళ్లను ట్రాక్​ చేయడం, అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయడం సాధ్యం కాకపోవడంతో ఇలాంటి కేసులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సైబర్​ క్రైమ్​ పోలీసులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి యాప్​ల పట్ల అలెర్ట్​గా ఉండాలని సూచిస్తున్నారు. 

యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటూ లింకులు

మధిరకు చెందిన వింజమూరి ప్రదీప్​ ఓ లోన్​యాప్​ ద్వారా రూ.5 వేలు లోన్ తీసుకున్నాడు. వారం రోజుల్లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాడు. ఆ తర్వాత రూ.3,500 చొప్పున రెండు సార్లు లోన్ తీసుకున్నాడు. గడువు లోగా తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తే, యాప్, వెబ్ సైట్ పనిచేయలేదు. దీంతో నిర్వాహకులకు ఫోన్ చేస్తే యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటూ లింకులు పంపారు. వారు పంపిన యూపీఐ ఖాతాకు మొత్తం పేమెంట్ చేసిన తర్వాత కూడా, ఇంకా బకాయి ఉందంటూ ప్రదీప్​కు ఫోన్​ చేసి టార్చర్​పెట్టారు. మరో రూ.1,500 కట్టకపోతే మీ అమ్మ ఫొటోను మార్ఫింగ్ చేసి బూతు సైట్లలో పెడతామని బెదిరించారు. ప్రదీప్​ ఫోటో మీద కాల్ గర్ల్స్​ కావాలంటే ఫోన్​ చేయాలంటూ అతని నంబర్​ ఇచ్చి, అతని కాంటాక్ట్ నంబర్స్​ కు ఫార్వర్డ్ చేశారు. దీంతో ప్రదీప్​ మధిర పోలీసులకు కంప్లైంట్ చేశాడు. 

లింగయ్య ఫొటోలను అర్ధనగ్నంగా..

వైరాకు చెందిన కొక్కిరేణి లింగయ్యకు అతని ఫ్రెండ్ ఓ యాప్​ గురించి చెప్పి, అతని ఫోన్​లో ఇన్​స్టాల్ చేశాడు. ఆ యాప్​ నుంచి లింగయ్య రూ.3 వేలు లోన్​ తీసుకున్నాడు. మొదటి విడతగా రూ.1100 చెల్లించాడు. ఇంకో రెండు ఇన్ స్టాల్ మెంట్ లను యాప్​ ఎగ్జిక్యూటివ్ పంపిన లింక్​ ల ద్వారా కట్టేశాడు. అయినా, ఇంకా ఇన్​స్టాల్ మెంట్లు కట్టలేదంటూ లింగయ్య ఫొటోలను అర్ధనగ్నంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్​లోడ్​ చేశారు. లింగయ్య చెల్లి , తల్లి ఫొటోలపై కూడా అసభ్య కామెంట్లతో బంధు మిత్రులకు పంపించారు. దీంతో బాధితుడు లింగయ్య వైరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఇన్​స్టంట్ లోన్​ యాప్​లను నమ్మొద్దు

ఇన్​స్టంట్​లోన్​లు ఇస్తామంటూ ఆఫర్​చేసే యాప్​లను నమ్మొద్దు. బ్యాంక్​ లు, ఫైనాన్షియల్ గా ట్రస్టెడ్ కంపెనీలు తప్పించి ఇతర గుర్తింపులేని యాప్​ల జోలికి పోవద్దు. నగదు లావాదేవీల విషయంలో రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ సంస్థలనే ఆశ్రయించాలి. సైబర్​ దోస్త్ ప్రోగ్రామ్​ ద్వారా ఆన్​లైన్​ మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం. 

- విష్ణు ఎస్​.వారియర్​, ఖమ్మం పోలీస్ కమిషనర్