పర్మిషన్ పట్టాభూముల్లో.. తవ్వకాలు నదిలో..!

V6 Velugu Posted on Oct 14, 2021

మహబూబ్​నగర్​/మిడ్జిల్​/నవాబ్​పేట్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ఇసుకాసులు అక్రమాలకు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. పట్టాభూముల్లో పర్మిషన్ తీసుకొని నదిని ఖాళీ చేస్తున్నారు.  టిప్పర్లలో రాత్రికి రాత్రే పట్టణాలకు తరలించి క్యాష్​ చేసుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తాము అధికార పార్టీకి చెందిన వ్యక్తులమంటూ బెదిరింపులకు దిగుతున్నారు.  అయితే స్థానిక రైతులు ఎదురు తిరగబడడంతో 25 టిప్పర్లు పోలీస్‌‌ స్టేషన్‌‌కు చేరాయి.  మహబూబ్​నగర్ ​జిల్లాలోని దుందుభి నది నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్నది.  మంగళవారం అర్ధరాత్రి మిడ్జిల్ మండలం చిల్వేర్​ గ్రామ సమీపంలోని నది నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు వచ్చిన 25 టిప్పర్లను రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.  వాహనాలను అక్కడి నుంచి కదలకుండా టైర్లలో గాలితీశారు. బుధవారం ఉదయం నదివద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఇసుకను తరలించడం వల్ల బోరు బావులు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు.  దీంతో టిప్పర్ల ఓనర్లు రైతులతో కొట్లాటకు దిగారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ కాంతమ్మ, టీపీసీసీకార్యదర్శి రబ్బాని, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎంపీటీసీలు గౌస్, రాజారెడ్డి, నర్సిములు, సీపీఐ, సీపీఎం నాయకులు సత్తయ్య, బాగి కృష్ణ  సంఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  అనంతరం తహసీల్దార్​ శ్రీనివాసులు, జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప ఘటనా స్థలానికి చేరుకొని 25  టిప్పర్లను పోలీస్​స్టేషన్ కు తరలించారు.

ఎమ్మెల్సీ అల్లుడినంటూ..

ఇసుక అక్రమ రవాణా అంతా అధికార పార్టీకి చెందిన ఓ  నేత కనుసన్ననల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన  ఓ ఎమ్మెల్సీ అల్లుడినంటూ దుందుభి నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అన్ని పర్మిషన్లు ఉన్నాయని, ఎక్కువ మాట్లాడితే బాగుండదని బెదిరిస్తున్నాడని వాపోతున్నారు.  నిజానికి ఈయన నాగర్​కర్నూల్​ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామ శివారులోని సర్వే నెం.812లోని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు పర్మిషన్‌‌ తీసుకున్నట్లు సమాచారం. కానీ, అక్కడి నుంచి కాకుండా చిల్వేర్ శివారులో ఉన్న దుందుభి నుంచి ఇసుకను తోడుతున్నాడు. ఇందుకోసం ఏకంగా నదిలో మొరంతో రోడ్డు కూడా వేయించాడు. స్థానిక నేతలు, ఆఫీసర్లను  మేనేజ్​ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  చిల్వేరు సర్పంచ్‌‌కు గ్రామంలో ఓ ఆలయ నిర్మాణానికి  రూ.10 లక్షలు ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

Tagged Telangana, Mahabubnagar, Sand Mafia

Latest Videos

Subscribe Now

More News