BBL 2025-26: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ ఔట్ .. బిగ్ బాష్ లీగ్ టైటిల్ విజేత పెర్త్ స్కార్చర్స్

BBL 2025-26: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ ఔట్ .. బిగ్ బాష్ లీగ్ టైటిల్ విజేత పెర్త్ స్కార్చర్స్

బిగ్ బాష్ లీగ్ 2025-26 టైటిల్ ను పెర్త్ స్కార్చర్స్ గెలుచుకుంది. ఆదివారం (జనవరి 25) సిడ్నీ సిక్సర్స్ పై ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. పెర్త్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిధ్య పెర్త్ జట్టు మొదట బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో దుమ్ములేపి రికార్డ్ స్థాయిలో ఆరోసారి టైటిల్ గెలుచుకుంది. ఝే రిచర్డ్సన్ (3/32), డేవిడ్ పేన్ (3/18), మిచెల్ మార్ష్ (44) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పెర్త్ స్కార్చర్స్ 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి గెలిచింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీకి మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టు ప్రారంభంలోనే డేనియల్ హ్యూస్ (7) వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో సూపర్ ఫామ్ లో ఉన్న స్టీవెన్ స్మిత్ (24) వరుస బౌండరీలతో స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లాడు. ఆరోన్ హార్డీ ఒక అద్భుతమైన డెలివరీతో స్మిత్ ను ఔట్ చేయడంతో 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో జోష్ ఫిలిప్ (24), మోయిసెస్ హెన్రిక్స్ (24) వికెట్ కు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో స్కోర్ బోర్డు నత్త నడకన సాగింది. వీరిద్దరూ ఔట్ కావడంతో జట్టును ముందుకు తీసుకెళ్లేవారు ఎవరూ లేకపోయారు. దీంతో సిక్సర్స్ 132 పరుగుల స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. 

లక్ష్య ఛేదనలో పెర్త్ స్కార్చర్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఫిన్ అల్లెన్ జట్టుకు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. 8.2 ఓవర్లలోనే వీరి జోడీ 80 పరుగులు చేసి జట్టును విజయం దగ్గరకు తీసుకొని వచ్చారు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన అలెన్ ను స్టార్క్ ఔట్ చేయడంతో పెర్త్ తమ తొలి వికెట్ కోల్పోయింది. ఆరోన్ హార్డీ (5), ఆష్టన్ టర్నర్ (2) త్వరగా ఔటైనా జోష్ ఇంగ్లిస్ తో కలిసి మార్ష్ జట్టుకు విజయాన్ని అందించారు. డేవిడ్ పేన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సామ్ హార్పర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్థులు లభించాయి. 

ఈ విజయంతో పెర్త్ స్కార్చర్స్ 6 టైటిల్స్ తో ఫ్రాంచైజీ లీగ్ లో అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. పెర్త్ 2014, 2015, 2017,2022, 2023, 2026 లో బిగ్ బాష్ టైటిల్స్ గెలుచుకుంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రినిడాడ్ అండ్ టొబాగో 5 టైటిల్స్ తో రెండో స్థానంలో నిలిచాయి. బిగ్ బాష్ లీగ్ లో స్కార్చర్స్ 6 టైటిల్స్ తో అగ్రస్థానంలో నిలిస్తే.. సిడ్నీ సిక్సర్స్ మూడు టైటిల్స్ తో రెండో స్థానంలో ఉంది.