
- బండి సంజయ్‌కి పెరుమాండ్ల గూడెం రైతుల మొర
- అండగా ఉంటామని హామీ ఇచ్చిన బీజేపీ స్టేట్ చీఫ్
హైదరాబాద్/వరంగల్ సిటీ, వెలుగు:ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా కొట్లాడిన హనుమకొండ జిల్లా పెరుమాండ్ల గూడెం రైతులు సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్‌ను కలిశారు. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, క్రూరంగా వ్యవహరించారని సంజయ్‌కి మొరపెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే పోలీసులు తమపై దాడి చేశారని వాపోయారు. సీఐ విశ్వేశ్వర్, ఎస్‌ఐ రమేశ్ అర్ధరాత్రి తమను స్టేషన్‌కు తరలించి చిత్రహింసలు పెట్టారని విలపించారు. తమ ఇంటి ఆడపడుచులను ఉద్దేశించి బూతులు తిట్టారని, టీఆర్‌ఎస్ నాయకులు, పోలీసుల నుంచి తమకు ప్రాణహానీ ఉందని, కాపాడాలని సంజయ్‌ని కోరారు. అండగా ఉంటామని వారికి సంజయ్ హామీ ఇచ్చారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను, స్థానిక ఎమ్మెల్యేను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునే వరకూ పోరాడుతామని చెప్పారు. కాగా, బాధితులు, వారి పిల్లలు మానవ హక్కుల కమిషన్ తో పాటు బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లో మోడీ రోడ్ షో!
ప్రధాని నరేంద్ర మోడీతో హైదరాబాద్‌లో భారీ రోడ్ షో నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ మోడీ చేసిన రోడ్ షోలలో టాప్ 5లో ఒకటిగా హైదరాబాద్ రోడ్ షో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పార్టీ నేతలు తెలిపారు. దీనిపై చర్చించేందుకు హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టూ ఉన్న 8 జిల్లాల పార్టీ అధ్యక్షులతో పార్టీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ సోమవారం సమావేశం నిర్వహించారు. మరోవైపు, వచ్చే నెల 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండ ఓ సమావేశం నిర్వహించారు. బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, జాతీయ కార్యవర్గ సమావేశాల ఇన్చార్జ్ అరవింద్ మీనన్ ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.
ఫీజు బకాయిలు రూ.4 వేల కోట్లు రిలీజ్ చేయాలె
రాష్ట్ర సర్కార్ రెండేండ్లుగా బకాయి పడిన రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని సోమవారం బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.