ముసురు దెబ్బకు పెసర రైతు ఆగం

ముసురు దెబ్బకు పెసర రైతు ఆగం

1.53 లక్షల ఎకరాలు వేస్తే లక్ష ఎకరాల్లో పంట నష్టం

రాష్ట్రవ్యాప్తంగా పెసర రైతులకు రూ.400 కోట్ల లాస్​

11 రోజుల ముసుర్లకు చేన్లు నాశనం

కోటి పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఖమ్మం జిల్లా మేడిదపల్లి రైతులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పెసర రైతులు భారీగా నష్టపోయారు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు పంటను ముంచేశాయి. కొన్ని జిల్లాల్లో ముసురు వానలతో పెసర చేనులోనే మొలకలు వచ్చి పంట పూర్తిగా  దెబ్బతిన్నది. ఫలితంగా దాదాపు రూ.300 కోట్ల విలువైన పంట డ్యామేజీ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రూ.100 కోట్ల వరకు నష్టపోయారు. దీంతో ఈ ఏడాది పైసర రైతులు రూ.400 కోట్ల మేర నష్టపోయారు.

1.07 లక్షల ఎకరాల్లో పంట నష్టం

ఈ ఏడాది 1.88 లక్షల ఎకరాల్లో పెసర పంట వేయాలని వ్యవసాయ శాఖ టార్గెట్‌ పెట్టుకుంది. రైతులు 1.53 లక్షల ఎకరాల్లో పంట వేశారు. సకాలంలో వర్షాలు పడడంతో పంట బాగా వచ్చింది. కానీ తీరా పంట తెంపేదశలో ఆగస్టులో వర్షాలు కురిశాయి. దీంతో పంట పూర్తిగా దెబ్బతింది. పెసర పంట నీట మునగడంతో పెసరకాయలు మురిగిపోయాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు ఒక లక్షా 7 వేల ఎకరాల్లో పెసర పంటకు పంటనష్టం జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో 50 శాతం, మరికొన్ని జిల్లాల్లో 70 నుంచి 100 శాతం పెసర పంట దెబ్బతిన్నట్లు అధికారిక అంచనాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 37,821 ఎకరాల్లో అత్యధికంగా సాగు చేయగా.. ఈ జిల్లాలో కొన్ని మండలాల్లో  60 శాతం, మరికొన్ని మండలాల్లో 70%కు పైగా రైతులు నష్టపోయారు. ఇక ఖమ్మం జిల్లాలో 24,665 ఎకరాల్లో పెసర వేయగా వర్షాలకు దాదాపు పూర్తిగా పంట నష్టపోయారు. వికారాబాద్‌ జిల్లాలో  24,311 ఎకరాల్లో పంట వేయగా.. 100 శాతం పంట డామేజ్‌ అయినట్లు రైతులు వాపోయారు. సూర్యాపేటలో 12,561 ఎకరాలు వేస్తే 50 శాతంకు పైగా దెబ్బతిన్నది. ఆగస్టు 10 నుంచి 21వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో 11 రోజులు ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రమంతటా 556 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో సగటున  రోజు 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఆగస్టులో 78 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. దీంతో పెసర పంట పూర్తిగా దెబ్బతిన్నది. చాలా చోట్ల ఎండు దశలో ఉన్న పెసర కాయకు నిమ్ముచేరి చేనులోనే గింజలు మొలకెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మద్దతు ధర ఎక్కువుందని వేస్తే..

పెసరకు మద్దతు ధర రూ.7,160 ఉండడంతో రైతులు ఈ పంట సాగు చేశారు. భారీగా పెట్టుబడి పెట్టారు. జూన్‌ లో వేసిన పెసర చేన్లు ఆగస్టు నాటికి కోతకు వచ్చాయి. కానీ ఆగస్టు వర్షాలకు పంట కోసం పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం వృథా అయిందని రైతులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని మేడిదపల్లి గ్రామంలో రైతులు దాదాపు వెయ్యి ఎకరాల వరకు పెసర చేన్లు వేస్తారు. ఈ జిల్లాల్లో ఇక్కడే పెసర అత్యధికంగా సాగు చేస్తారు. ఎకరానికి పది వేల చొప్పున ఈ ఒక్క గ్రామంలోనే రూ.కోటి వరకు పెట్టబడి పెట్టారు. ఎకరానికి రూ.30 వేల చొప్పున మూడు కోట్ల వరకు ఆదాయం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

20 ఎకరాల్లో వేసిన

ధర బాగుందని, ఈసారి 20 ఎకరాల్లో పెసర పెట్టినం. పెట్టుబడి రూ.80 వేల వరకు అయింది. కటింగ్‌ దశలో వానలు రావడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. పశువులకు దానా మాదిరిగా కూడా పనికి రాకుండా పంట డామేజ్‌ అయింది.

– మర్ల పుల్లారెడ్డి, మేడిదపల్లి, ఖమ్మం జిల్లా

పంట మొత్తం పోయింది

30 గుంటలు పెసర చేను వేస్తే వానలకు అంతా దెబ్బతిన్నది. కనీసం రూ.30 వేలు వస్తయనుకుంటే  కన్నీళ్లే మిగిలినయ్‌. వానలు ముంచినయ్‌.

– జీ.బుచ్చయ్య, దుర్గం చెరువు, వికారాబాద్‌ జిల్లా

For More News..

‘సింగమ్ ’లు అనుకోవద్దు

కరోనాతో ఊర్లు గావర.. పెరుగుతున్న కేసులు

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్