హైదరాబాద్, వెలుగు: పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్ లో మండలి పిటిషన్స్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ఈ కమిటీ సభ్యులందరూ చురుగ్గా పనిచేస్తేనే కమిటీకి మంచి పేరు వస్తుందన్నారు. ప్రజల నుంచి వచ్చే పిటిషన్స్ పెండింగ్ లేకుండా చూసుకోవాలని కోరారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అధికారపక్షం.. ప్రతిపక్షం అనే బేధం లేకుండా అసెంబ్లీ, కౌన్సిల్ సభలను నడుపుతున్నట్లు చెప్పారు. పిటిషన్స్ కమిటీలో సభ్యులుగా స్థానం దక్కడం అదృష్టంగా భావించాలని, ఇలాంటి కమిటీల్లో చురుగ్గా పనిచేస్తే అనుభవం పెరుగుతుందన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్.. పిటిషన్స్ కమిటీకి చైర్మన్ గా సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు కమిటీ సభ్యులు దాసోజు శ్రవణ్, దామోదర్ రెడ్డి, కోదండరాం, రహ్మత్ బేగం, మండలి సెక్రటరీ నర్సింహా చార్యులు పాల్గొన్నారు.
