రోజుకు 90 వేల లీటర్లే..

రోజుకు 90 వేల లీటర్లే..

యాదాద్రి, వెలుగు : కరోనా కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం కోసం బయటకు వచ్చే వాహనాలే తప్ప మిగతా బైక్ లు, కార్లు, ఆటోలతో పాటు లారీలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు మూడు లక్షలు ఉండగా, ప్రస్తుతం పది శాతం వాహనాలు కూడా సరిగ్గా తిరగడం లేదు.

లాక్ డౌన్ కు ముందు..

ఉమ్మడి జిల్లాలో భారత్, ఇండేన్, హెచ్ పీ కంపెనీలకు చెందిన 382 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇందులో నల్గొండలో 181, సూర్యాపేటలో 109, యాదాద్రిలో 92 బంకులు ఉన్నాయి. లాక్ డౌన్​కు ముందు రోజుకు సుమారు 3.50 లక్షల లీటర్ల పెట్రోల్, 8.76 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగేవి. ఈ లెక్కన ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.02 కోట్ల లీటర్ల పెట్రోల్, 2.63 కోట్ల లీటర్ల డీజిల్ అమ్ముడుపోయింది. మార్చి 23 నుంచి లాక్​డౌన్​విధించడంతో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోయాయి. మార్చిలో పెట్రోల్ కోటి లీటర్లు అమ్ముడుపోగా, 2.43 కోట్ల లీటర్ల డీజిల్ అమ్ముడుపోయింది.

ఈ నెలలో 80 శాతం తగ్గిన అమ్మకాలు

ఏప్రిల్ నెలలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై లాక్ డౌన్ ప్రభావం గట్టిగానే పడింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అమ్మకాలు 80 శాతం కంటే ఎక్కువే తగ్గిపోయాయి. ప్రస్తుతం రోజుకు 20 వేల లీటర్ల పెట్రోల్, 70 వేల లీటర్ల డీజిల్ అమ్మకాలు మాత్రమే జరుగుతున్నాయి. రబీ సీజన్ వరి ధాన్యం కోతలు ప్రారంభం కావడంతో పెట్రోల్ కంటే డీజిల్​అమ్మకాలు కాస్త మెరుగ్గా ఉన్నాయని పలువురు యజమానులు చెబుతున్నారు.