పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ క్షణమైనా పెరగొచ్చు. దీని కోసం కేంద్రం రెడీ అయిపోయింది. ఇప్పటికే ప్రధాని మోదీ సంకేతాలు ఇచ్చేశారు. కరోనా లాక్ డౌన్ లాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మోదీ. ఇదే సమయంలో ఆర్థిక శాఖతో ఆయిల్ కంపెనీలు భేటీ అయ్యాయి. ఇంధన నష్టాలను వివరించాయి.
ఆర్థిక శాఖతో ఆయిల్ కంపెనీల భేటీలో కీలక అంశాలు బయటకు వచ్చాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి.. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, రవాణా ఛార్జీలు అన్ని కలుపుకుంటే.. దేశంలోని ఆయిల్ కంపెనీలు అక్షరాల లక్ష కోట్ల రూపాయలు నష్టపోయినట్లు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో ఇది 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేశాయి. ధరల పెంపు ఒక్కటి నష్టాలకు పరిష్కారం అని.. ఇదే విధంగా నష్టాలను భరిస్తూ ఉంటే ఆయిల్ కంపెనీల మనుగడ కష్టం అని ఆర్థిక శాఖకు వెల్లడించాయి ఆయిల్ కంపెనీలు.
లక్ష కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆయిల్ కంపెనీలు గట్టేక్కాంటే.. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ఒక్కటే పరిష్కారం అని స్పష్టం చేశాయి.
లీటర్ పెట్రోల్, డీజిల్ పై కనీసం 4 నుంచి 5 రూపాయల వరకు తక్షణ పెంపు ఉండాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి. అంతేకాకుండా దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గాలని.. అప్పుడే ఆయిల్ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని వివరించాయి ఆయిల్ కంపెనీలు. కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వ శాఖతో ఆయిల్ కంపెనీలు నిరంతరం జరుపుతున్న చర్చల్లో ఈ అంశాలు కీలకంగా ఉన్నాయి.
దేశంలో ఏ క్షణమైన పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగొచ్చని.. ఇంధన ధరల పెంపు అనివార్యంగా అని స్పష్టం చేశారు గ్రాంట్ థర్నోటన్ భారత్, ఆయిల్ అండ్ గ్యాస్ పార్టనర్ సౌరవ్ మిత్రా. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ అమ్మకాలపై నష్టాలను పూడ్చుకోవటానికి.. తక్షణమే ధరల పెంపు ఒక్కటే పరిష్కారం అంటూ జాతీయ బిజినెస్ ఛానెల్స్ హైలెట్ చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ పై ఇటీవల కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతి రోజు 14 వేల కోట్ల రూపాయలు నష్టపోతుందని.. ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక సంక్షోభం వస్తుందనే భయాన్ని వ్యక్తం చేశారు కేంద్రం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్టర్ హర్ దీప్ సింగ్ పూరీ.
అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర 105 డాలర్లుగా ఉందని.. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణ ఇంకా తగ్గలేదని.. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని.. రాబోయే రోజుల్లో బ్యారల్ క్రూడ్ ఆయిల్ 120 డాలర్లకు చేరుకోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి.
అంతర్జాతీయంగా రోజురోజుకు పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, రవాణా ఛార్జీలతో పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు అనివార్యంగా కనిపిస్తుందని.. దేశంలో ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ఖాయమని కేంద్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎంత పెంచుతారు.. ఎంత పెంచనున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా పెంచారు. చిన్న వ్యాపారులు దెబ్బతిన్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచితే.. జనంలో భారం భారీగా పడనుంది.
