V6 News

నిద్రమాత్రలు మింగి.. ఇంజెక్షన్ వేసుకుని.. ఉస్మానియాలో పీజీ డాక్టర్ సూసైడ్

నిద్రమాత్రలు మింగి.. ఇంజెక్షన్ వేసుకుని.. ఉస్మానియాలో పీజీ డాక్టర్ సూసైడ్
  • చదివే కోర్సు ఇష్టం లేకనే అన్న పోలీసులు, తోటి డాక్టర్లు   
  • ర్యాగింగ్, సీనియర్ల వేధింపులే కారణమన్న తల్లి 

అబిడ్స్, వెలుగు: ఓ పీజీ డాక్టర్​తన హాస్టల్ రూమ్ లో నిద్రమాత్రలు మింగి, ఇంజెక్షన్ ​వేసుకుని సూసైడ్​ చేసుకున్నాడు. హైదరాబాద్​లోని అఫ్జల్​గంజ్​ఉస్మానియా హాస్పిటల్​లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇష్టం లేని కోర్సులో జాయిన్​అవడం వల్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తుండగా.. సీనియర్ల వేధింపులు, కులం పేరుతో దూషించడమే కారణమని మృతుడి తల్లి ఆరోపించింది. 

మహబూబ్​నగర్​ జిల్లా కోడుగల్ మండలం పాలుగడ్డ తండాకు చెందిన కాట్రావత్​ రాంచందర్, నాగమణి దంపతుల కుమారుడు సురేశ్(26) చిన్నప్పటి నుంచి చదువుల్లో టాపర్. మహబూబ్​నగర్​ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్​లో పీజీ జనరల్ సర్జరీ విభాగంలో సీటు సాధించాడు. 3 నెలలుగా ఆస్పత్రి ప్రాంగణంలోని పీజీ హాస్టల్ లో ఉంటూ ఫస్ట్​ఇయర్​ చదువుతున్నాడు. 

రోజూ ఉదయం, సాయంత్రం తల్లికి ఫోన్​చేసేవాడు. గురువారం ఉదయం 7.30 గంటలకు ఫోన్​చేసి, కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నాడు. కొద్దిసేపటికే హాస్టల్ గదిలో నిద్రమాత్రలు మింగి, ఇంజెక్షన్​ వేసుకుని, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన తోటి డాక్టర్లు అతన్ని వెంటనే క్యాజువాలిటీకి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

కోర్సు ఇష్టం లేకనేనా?

చదువుతున్న కోర్సు ఇష్టం లేక మానసిక ఒత్తిడికి గురైన సురేశ్​ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. సురేశ్​ కోరుకున్నది పీజీ జనరల్ మెడిసిన్ అయితే, మూడు కౌన్సెలింగ్​లలో కోరుకున్న విభాగంలో సీటు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని తోటి డాక్టర్లు చెప్తున్నారు. కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడని, కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు ఇష్టం లేకపోయినా పీజీ జనరల్ సర్జరీలో చేరాడని అంటున్నారు. 

సీనియర్ల వేధింపుల వల్లనా?

తన కుమారుడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, సీనియర్ల వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని సురేశ్​తల్లి నాగమణి ఆరోపించింది. రోజూ కులం పేరుతో దూషించారని అది తట్టుకోలేకనే సూసైడ్​ చేసుకున్నాడని రోదించింది. తనకు ఫోన్​ చేసినప్పుడల్లా కాలేజీలో ర్యాగింగ్​ చేస్తున్నారని, కులం పేరుతో తిడుతున్నారని చెప్పి ఆవేదన చెందేవాడని చెప్పింది. 

తాము ఏమీ కాదని, సర్ధి చెప్పామని పేర్కొంది. నైట్​డ్యూటీలు ఎక్కువగా వేసి సతాయించారని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరపాలని కోరింది. అయితే, కేసు నమోదు చేశామని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మృతదేహాన్ని తరలించకుండా అడ్డగింత

ఓపీ భవనంలోని క్యాజువాలిటీ నుంచి సురేశ్​మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించకుండా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకూ పోస్టుమార్టం చేయనిచ్చేది లేదంటూ బంధువులతో కలిసి మార్చురీ ఎదుట బైఠాయించారు. చివరకు పోలీసులు వచ్చి.. ఫిర్యాదు​ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.