ప్రజలను ఆదుకునేందుకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలె

ప్రజలను ఆదుకునేందుకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలె

హైదరాబాద్: ప్రజలను ఆదుకునేందుకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ బొల్లారం కొవిడ్ ఆస్ప‌త్రిని రేవంత్ రెడ్డి స్పందించారు. బొల్లారం పీహెచ్‌సీని కొవిడ్ ఆస్ప‌త్రిగా మార్పు చేసి చికిత్స అందించాల‌ని రేవంత్ నిర్ణయించారు. ఎంపీ ఫండ్స్‌, దాతల స‌హకారంతో 50 ప‌డ‌క‌ల ఆక్సిజ‌న్ బెడ్స్‌తో కొవిడ్ ఆస్ప‌త్రి ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి దాత‌లు అందించిన జ‌న‌రేట‌ర్‌ను రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో కొవిడ్ ఆస్ప‌త్రి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుందన్నారు.

'నా నియోజకవర్గంలో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన వ్యాక్సిన్ కార్యక్ర‌మాన్ని త్వరలో ప్రారంభిస్తాం. రెమిడెసివిర్ తోపాటు కొవిడ్‌కు అవ‌స‌ర‌మైన మందులు, చికిత్స పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. కంపెనీలు ఎక్క‌డ వ్యాపారం చేస్తే అక్క‌డే సీఎస్ ఆర్ ఫండ్స్ ఖ‌ర్చు చేయాలి. బొల్లారం ఆస్ప‌త్రికి అందించాల్సిన సీఎస్ ఆర్ ఫండ్ అందించ‌డంలో కంపెనీలు తాత్సారం చేస్తున్నాయి. ఇక్క‌డా వ్యాపారం చేస్తూ ఇక్క‌డి ప్ర‌జ‌ల క్షేమం ప‌ట్టించుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం ఎందుకు? నా నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఆ ఫార్మా కంపెనీల‌ కాలుష్యంతో ఇక్కడి ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ఫార్మా కంపెనీలు ముందుకు రావ‌డం లేదు' అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.