ఆరో విడతలో 61% పోలింగ్

ఆరో విడతలో 61% పోలింగ్
  • ఆరు రాష్ట్రాలు, రెండు యూటీల్లోని 58 లోక్​సభ సీట్లకు ముగిసిన పోలింగ్
  • ఆరు విడతల్లో కలిపి 486 సీట్లకు ఓటింగ్ పూర్తి  
  • జూన్ 1న చివరి విడతలో 57 సీట్లకు పోలింగ్
  • జూన్ 4న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ శనివారం ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు యూటీల్లోని 58 లోక్ సభ సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల సమయానికి 61.2% ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఇక లోక్ సభ ఎన్నికల్లో ఒక్క విడతే మిగిలి ఉంది. జూన్ 1న చివరి (ఏడో) విడతలో57 సీట్లకు పోలింగ్ తో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. లోక్ సభలో మొత్తం 543 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆరు విడతల్లో కలిపి 25 రాష్ట్రాలు/యూటీల్లోని 486  సీట్లకు ఓటింగ్ పూర్తయింది. ఆరో విడతలో ఢిల్లీలోని మొత్తం 7, హర్యానాలోని మొత్తం 10 లోక్ సభ సీట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. 

యూపీలో 14,  బిహార్ లో 8, బెంగాల్ లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్ లో 4, జమ్మూకాశ్మీర్ లో 1 సీటుకు ఓటింగ్ పూర్తయింది. వీటితోపాటు ఒడిశాలో 147 అసెంబ్లీ సీట్లు ఉండగా, ఈ విడతలో 42 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అలాగే హర్యానాలోని కర్నాల్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక కూడా జరిగింది. ఉత్తరాదిన ఎండలు మండిపోతుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద చల్లటి నీళ్లు, కూలర్లు, ఫ్యాన్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. ఆరో విడతలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబల్ పూర్ నుంచి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నుంచి, సంబిత్ పాత్ర పూరి నుంచి.. మేనకా గాంధీ సుల్తాన్ పూర్, దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ, మనోజ్ తివారి నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఇండస్ట్రియలిస్ట్ నవీన్ జిందాల్ కురుక్షేత్ర నుంచి బరిలో ఉన్నారు.   

ఢిల్లీలో ఓటేసిన ప్రముఖులు 

ఆరో విడత ఎన్నికల్లో శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్​లో ఏర్పాటు చేసిన పింక్ పోలింగ్ బూత్ (అందరూ మహిళా సిబ్బంది ఉండే బూత్)లో రాష్ట్రపతి ముర్ము క్యూలైన్​లో నిలబడి వెళ్లి ఓటు వేశారు. ఇదే బూత్​లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ఆయన భార్య సుదేశ్ ధన్ ఖడ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, ఆయన భార్య కల్పనా దాస్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, హర్ దీప్ సింగ్ పురి, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మంత్రి ఆతిశీ, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర ప్రముఖులు కూడా ఢిల్లీలో ఓటేశారు. ఓ పోలింగ్ బూత్ లో అందరికంటే ముందుగా ఓటు వేసిన జైశంకర్ కు ఎన్నికల అధికారులు ఫస్ట్ మేల్ ఓటర్ సర్టిఫికెట్ ను అందజేయగా, ఆయన దానిని మీడియాకు చూపించారు. కాగా, ఈవీఎం కంట్రోల్ యూనిట్ లో బ్యాటరీ అయిపోవడం వల్ల తాను ఓటు వేసేందుకు గంట పాటు ఎదురుచూడాల్సి వచ్చిందని సీపీఎం నేత బృందా కారత్ చెప్పారు. అయితే, ఓటింగ్ గంటసేపు నిలిపివేయలేదని, 15 నిమిషాల్లోనే బ్యాటరీని మార్చామని ఎన్నికల అధికారులు తెలిపారు. 

    ఢిల్లీలోని గవర్నమెంట్ స్కూల్స్ కు చెందిన అనేక మంది విద్యార్థులు పోలింగ్ కేంద్రాల్లో వాలంటీర్లుగా పని చేశారు. వృద్ధులు, వికలాంగులు పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకోవడంలో హెల్ప్ చేశారు. 
    
పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశాలోని అనేక చోట్ల ఓటర్లు చిరాకుపడ్డారు. కొందరు ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.  
    
రాంచీలో ఓటు వేసేవాళ్లకు ఓ బైక్ ట్యాక్సీ సంస్థ తరఫున ఉచితంగా పికప్, డ్రాపింగ్ సర్వీసులు నిర్వహించారు. 
    
అనంతనాగ్–రాజౌరీ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఎల్ఓసీ వద్ద ఉన్న సెహర్, మక్రీ ప్రాంతాల్లో పాక్ వైపు నుంచి కాల్పులు జరిగే ప్రమాదం ఉన్నా..  ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి ఓటు వేశారు.  
    
ఒడిశాలోని భాపూర్ ఏరియాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ వృద్ధురాలు స్పృహ తప్పి కిందపడిపోయారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఇదే రాష్ట్రంలోని హిందోల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఓ పోలింగ్ స్టేషన్ లో ఏజెంట్ గుండెపోటుతో మృతిచెందారు.