పలు యూనివర్సిటీల బాగోతం
మైసూర్‌లో డాక్టర్లేట్ల దందా
అడ్డుకున్న అక్కడి పోలీసులు
జిల్లా నుంచి పాల్గొన్న ప్రముఖులు
డాక్టరేట్ తీసుకోకుండానే ఇంటి దారి
డాక్టరేట్ రావాలంటే చాలా కష్టపడాలి. ఏదైనా సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి. దాంట్లో ఓ అంశంపై కనీసం మూడేళ్లపాటు పరిశోధన చేయాలి. లేదా ఏదైనా రంగంలో అసామాన ప్రతిభ కనబర్చినా.. సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా అలాంటి వారి గౌరవార్థం గుర్తింపు పొందిన యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇస్తాయి. కానీ ఇవేవి లేకుండానే కొన్ని యూనివర్సిటీలు డబ్బులిస్తే డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నాయి. ఇలాంటి డాక్టరేట్ల బాగోతాన్ని లోక్‌సత్తా వెలుగులోకి తెచ్చింది.
కరీంనగర్, వెలుగు: ఇతర రాష్ట్రాలకు చెందిన కొన్ని యూనివర్సిటీలు ఈ డాక్టరేట్ల దందా చేస్తున్నాయి. డబ్బులిస్తే చాలు సాహిత్యం, సేవా రంగం, అని పేర్కొంటూ డాక్టరేట్లు ఇస్తున్నాయి. ఈ కోవకు చెందినవే గ్లోబల్ పీస్ యూనివర్సిటీ, ఇంటర్‌నేషనల్ పీస్ యూనివర్సిటీ, ఇండియన్ వర్చువల్ యూనివర్సిటీ, కింగ్స్ యూనివర్సిటీ, తమిళ యూనివర్సిటీ వంటివి. ఈ యూనివర్సిటీల వారు కొంత మంది ప్రతినిధులను లోకల్‌గా నియమించుకుంటున్నారు. వీరు టౌన్లు, సిటీల్లో డబ్బులున్న వారు.. కొంత సామాజికంగా పలుకుబడి ఉన్నవారిని సంప్రదించి బుట్టలో వేస్తున్నారు. చిన్న చిన్న సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పబ్లిసిటీ, పాపులారిటీ కోసం చూస్తున్న వారి వెంటపడి మరీ ఒప్పిస్తున్నారు. మనిషిని బట్టి రేటు మాట్లాడుతున్నారు. కొంచెం పలుకుబడి.. డబ్బులు ఉంటే వారి నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో 20కి పైనే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నకిలీ యూనివర్సిటీలు ఇచ్చిన డాక్టరేట్ పట్టాలను సుమారు 20 మందికి పైనే తీసుకున్నారు. ఆరు నెలల కాలంలోనే వీరందరికి పట్టాలిచ్చారు. ఇందులో కానిస్టేబుల్ మొదలుకుని ప్రముఖ రాజకీయ నాయకులు.. విద్యా వేత్తలు ఉన్నారు. వీరంతా యూనివర్సిటీ ప్రతినిధుల మాయమాటలు నమ్మి డబ్బులు చెల్లించి తీసుకున్న వారే. తొలుత డాక్టరేట్లు ఇస్తుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే పనిగా అర్హత ఉన్నవారికి.. లేని వారికి కూడా వస్తుండడంతో పలు అనుమానాలు తలెత్తాయి. దీంతో లోక్‌సత్తా సభ్యులు ఓ వ్యక్తి ద్వారా ఈ యూనివర్సిటీల ప్రతినిధులను సంప్రదించి వీరి బాగోతాన్ని బయటకు తెచ్చారు. ఈ యూనివర్సిటీ ప్రతినిధుల మాటలు నమ్మి చాలా మంది మోసపోతున్నారు. కొంత మంది స్టేటస్ కోసం డబ్బులు ఖర్చయినా పర్లేదని అప్పు తెచ్చి మరీ కడుతున్నారు.
మైసూర్‌లో అడ్డుకున్న పోలీసులు..
ఈ దందాపై లోక్‌సత్తా బాధ్యులు అన్ని స్థాయిల్లో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర పీహెచ్‌డీ స్కాలర్స్ అసోసియేషన్ స్పందించింది. లోక్ సత్తా ఉద్యమ సంస్థ జిల్లా బాధ్యుడు నరెడ్ల శ్రీనివాస్ ప్రధానికి సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో శనివారం మైసూరులో నిర్వహించిన డాక్టరేట్ల ప్రదాన కార్యక్రమాన్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు జిల్లా నుంచి సైతం కొందరు వెళ్లారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణికి కూడా ఆహ్వానం అందించారు. ఆమె భర్త చల్ల హరిశంకర్‌ను కూడా ఈ యూనివర్సిటీ డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. డాక్టరేట్లు అందుకోకుండానే జిల్లా నుంచి వెళ్లిన వారు వెనుదిరగాల్సి వచ్చింది. డబ్బులకు డాక్టరేట్లు ఇస్తున్న ఇలాంటి ఫేక్ యూనివర్సిటీల భరతం పట్టాలని… ఫేక్ డాక్టరేట్లు ఇస్తున్న బ్రోకర్లు, ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని లోక్‌సత్తా బాధ్యులు, ప్రజలు కోరుతున్నారు. ఈ డాక్టరేట్లు పొందిన వారు తమ పేర్ల ముందు డాక్టర్ అనే పదాన్ని పెట్టుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటున్నారు.
రూ.20 వేలకే ఇచ్చారు..
నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ను. ఒక ఫ్రెండ్ ద్వారా ఏజెంట్‌ను సంప్రదించగా రూ.40 వేలు అడిగారు. అంతలేవు రూ.20 వేలు ఇస్తానని చెప్పాను. నాకు సామాజిక సేవా కార్యక్రమాల కింద డాక్టరేట్ ఇచ్చారు. అనారోగ్యంతో ప్రోగ్రామ్‌కు వెళ్లలేకపోతే ఇంటికే కొరియర్‌లో పంపించారు. -కస్తూరి శ్రీనివాస్ వరప్రసాద్
