తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంచిర్యాల వేదికగా మంత్రుల సమక్షంలో... 335 మంది సింగరేణి డిపెండెంట్లకు ఉద్యోగ పత్రాలు అందజేశారు భట్టి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కార్మికుల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతూ... సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తూ మరణిస్తే... ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను ఏకంగా కోటి రూపాయలకు పెంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు.
తెలంగాణ ఆస్తులను విధ్వంసం చేసినందుకే కదా... ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని గుర్తుచేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పూటకో అబద్ధం ఆడుతున్నారని... సింగరేణికి రావాల్సిన బొగ్గు గనులను అడ్డుకుంది బీఆర్‌ఎస్ కాదా? అని నిలదీశారు.సింగరేణిలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెల్వదా? కిషన్ రెడ్డికి సింగరేణి కార్మికులపై అంతగా చిత్తశుద్ధి ఉంటే... వెంటనే కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు ఎంక్వైరీ చేయించట్లేదు? దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉంది బీఆర్‌ఎస్ నాయకుల వ్యవహారం అంటూ భట్టి విమర్శనాస్త్రాలు సంధించారు.
►ALSO READ | బీజేపీ ఓటు చోరీ మాత్రమే కాదు.. సీటు చోరీ కూడా చేస్తోంది: మంత్రి కోమటిరెడ్డి
సింగరేణి బొగ్గు బ్లాకుల ఆక్షన్‌లో పాల్గొనకుండా బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్రలు చేశాయని... 2 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్లే సింగరేణి సంస్థకు 8 వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందని భట్టి ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించారని... రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కేసీఆర్ చేసిన అప్పులకు, ప్రస్తుతం తమ ప్రభుత్వం నెలకు ఏకంగా 7 వేల కోట్ల రూపాయల వడ్డీ కడుతోందని లెక్కలతో సహా బయటపెట్టారు.
గత ప్రభుత్వ హయాంలో సింగరేణి మెడికల్ ఇన్వాలిడేషన్‌లో కూడా బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందని... ఇకపై సింగరేణి మెడికల్ బోర్డ్ పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తుందని, కార్మికులకు పూర్తి న్యాయం చేకూరుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
