డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై మోదీ ప్రభుత్వ అసలు రాజకీయ ఎత్తుగడ ఇదే !

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై మోదీ ప్రభుత్వ అసలు రాజకీయ ఎత్తుగడ ఇదే !

నీట్ ఉద్యమాల ఒత్తిడికి మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే ఆనందంలో దేశ ప్రజలు మునిగిపోయినవేళ,  అదే అవకాశాన్ని ఉపయోగించుకుని డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాంటి విస్తృత ప్రజాచర్చ లేకుండా చాకచక్యంగా పూర్తిచేయాలన్నది మోదీ ప్రభుత్వ అసలు రాజకీయ ఎత్తుగడ.  దీనిని గమనించకపోతే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మరో యాభై సంవత్సరాలు తీరని నష్టం జరుగుతుంది.

నీట్ ఉద్యమాల వలన మోదీ ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గడం ప్రజాస్వామ్య విజయంగా భావించవచ్చు. కానీ అదే సమయంలో దేశ రాజకీయ భవిష్యత్తును శాశ్వతంగా  ప్రభావితం చేసే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, కులగణన వంటి అంశాలు నిశ్శబ్దంగా ముందుకు సాగుతున్నాయనే  విషయాన్ని ప్రజలు గుర్తించాలి.

నీట్ ఒక విద్యార్థి కాలేజీ సీటుకు  సంబంధించిన సమస్య మాత్రమే. డీలిమిటేషన్ అనేది రాబోయే యాభై సంవత్సరాలపాటు దేశంలో ఎవరు పాలించాలి, ఎవరు చట్టాలు చేయాలి, ఎవరు బడ్జెట్లు నిర్ణయించాలి, ఎవరి చేతుల్లో రాజకీయ అధికారం ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రక్రియ. అందుకే ఇది కేవలం ఎన్నికల సరిహద్దుల పునర్విభజన కాదు. భారత రాజకీయ అధికార నిర్మాణాన్ని తిరిగిరాసే ప్రక్రియ.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీలిమిటేషన్ అనంతరం ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్‌‌సభ స్థానాలపై సుమారు 50 శాతం పెంపు ఉంటుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అందరికీ  సమాన శాతం పెంపు ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైకి చూస్తే ఈ వాదన  సహేతుకంగానే అనిపిస్తుంది.  కానీ ప్రజాస్వామ్యంలో సమాన శాతం అంటే సమాన న్యాయం కాదు.

ఇప్పటికే  ఎక్కువ రాజకీయ ప్రాతినిధ్యం కలిగిన రాష్ట్రాలకు మరో 50 శాతం పెంపు అంటే వారి రాజకీయ బలం మరింత పెరుగుతుంది. తక్కువ ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాలకు అదే శాతం పెంపు వచ్చినా, సంఖ్యాపరంగా వారు మరింత వెనుకబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సమానత్వం కాదు.  ‘ఉన్నవాడికి ఇంకా ఎక్కువ.. లేనివాడికి ఇంకా తక్కువ’ అనే  పరిస్థితిని శాశ్వతం చేయడమే. ఇంకోలా  చెప్పాలంటే ఉన్నవాడిని ఉయ్యాలలో ఊపి లేనివాడిని  నేలమీదే పడుకోబెట్టినట్టే ఉంది అమిత్ షా ప్రతిపాదన.

సమన్యాయ సూత్రం అవసరం
అందుకే సమాన శాతం పెంపు కాకుండా సమన్యాయ సూత్రం అవసరం.  దీనికి ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏమిటంటే ‘టెలిస్కోపిక్ వెయిటేజీ’ విధానం. ప్రస్తుతం రాజకీయంగా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాలు, సామాజిక వర్గాలు,  ప్రాంతాలకు అధిక వెయిటేజీ ఇవ్వాలి. ఇప్పటికే  అధిక  ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాలకు సాధారణ పెంపు సరిపోతుంది.  ఇదే సమాఖ్య స్ఫూర్తికి,  సామాజిక న్యాయానికి,  రాజ్యాంగ సమానత్వానికి అనుగుణమైన మార్గం. 

ఇంతకంటే పెద్ద ప్రశ్న కులగణన. దేశంలో  బీసీలు ఎంతమంది?  మహిళల్లో  బీసీలు ఎంతమంది?  ముస్లింలు, క్రిస్టియన్లు, ఎస్సీలు, ఎస్టీలు వాస్తవ జనాభాలో ఎంత మంది? వారికి రాజకీయంగా ఎంత ప్రాతినిధ్యం రావాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే కొత్త రాజకీయ పటాన్ని గీయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పాల్సిందే.

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా తదుపరి జనగణన, డీలిమిటేషన్‌‌తో అనుసంధానించారు. కానీ మహిళల్లో సామాజిక న్యాయం ఎలా అమలవుతుంది అనే విషయంపై మౌనం కొనసాగుతోంది.  బీసీ  మహిళలకు, ఎస్సీ మహిళలకు,  ఎస్టీ మహిళలకు, ముస్లిం మహిళలకు,  క్రిస్టియన్ మహిళలకు తగిన రాజకీయ వాటా లేకపోతే  మహిళా రిజర్వేషన్ అసలు లక్ష్యం ఎలా నెరవేరుతుంది?

డీలిమిటేషన్‌‌లో కూడా ప్రత్యేక ప్రమాణాలు 
డీలిమిటేషన్ చర్చలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్న  మరో వర్గం ఆదివాసీలు. షెడ్యూల్డ్ ఏరియాల్లో జనాభా సాంద్రత తక్కువగా ఉంటుంది.  కానీ  భౌగోళిక  విస్తీర్ణం అపారంగా ఉంటుంది.  ఒక ఆదివాసీ ఎమ్మెల్యే లేదా ఎంపీ కొండలు, అడవులు, నదులు దాటి వందల గ్రామాలకు  చేరుకోవాల్సి ఉంటుంది.

మైదాన ప్రాంతంలోని  నియోజకవర్గంతో  ఏజెన్సీ నియోజకవర్గాన్ని ఒకే  కొలమానంతో  కొలవడం రాజ్యాంగ న్యాయానికి విరుద్ధం. జనాభానే ఒకే ప్రమాణంగా తీసుకుంటే ఆదివాసీల రాజకీయ ప్రాతినిధ్యం మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఐదో షెడ్యూల్ ప్రాంతాలకు  ప్రత్యేక రాజ్యాంగ పరిరక్షణ ఉన్నట్లే, డీలిమిటేషన్‌‌లో కూడా ప్రత్యేక ప్రమాణాలు ఉండాలి. జనాభాతో పాటు భౌగోళిక విస్తీర్ణం, కొండ ప్రాంతాల స్వభావం, గ్రామాల మధ్య దూరం, రవాణా సౌకర్యాల లేమి,  పరిపాలనా క్లిష్టత వంటి అంశాలకు కూడా వెయిటేజీ ఇవ్వాలి. లేకపోతే రాజ్యాంగం రక్షించాల్సిన ఆదివాసీలే రాజకీయంగా అత్యంత అప్రధాన వర్గంగా మారిపోతారు.

రాజకీయంగా బలహీనపరిచే విధానాలు
దక్షిణాది రాష్ట్రాల విషయంలోనూ ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది.  జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే పరిస్థితి వస్తే, అది సమాఖ్య వ్యవస్థకు సరైన సంకేతం కాదు. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు బహుమతి ఇవ్వాల్సింది పోయి, రాజకీయంగా బలహీనపరిచే విధానాలు అవలంబించడం  దేశ సమాఖ్య స్ఫూర్తికి అనుకూలం కాదు.

ఈ మొత్తం పరిణామాన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, ముస్లింలు, క్రిస్టియన్లు కేవలం రాజకీయ చర్చగా  చూడకూడదు. ఇది వారి రాజకీయ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న. శాసనసభల్లో, పార్లమెంట్‌‌లో ప్రాతినిధ్యం లేకుంటే చట్టాలు ఇప్పటి ఆధిపత్య వర్గాలే చేస్తాయి. బడ్జెట్లు ఇతరులే నిర్ణయిస్తారు.  వనరుల పంపిణీ, విద్యా విధానాలు, ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ వారి రాజకీయ సంకల్పంపైనే  ఆధారపడతాయి. రాజకీయ అధికారం లేకపోతే  సామాజిక, ఆర్థిక పురోగతి కూడా శాశ్వతంగా ఇతరుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడే ప్రమాదం ఉంటుంది. అదే రాజకీయ బానిసత్వం.

దేశవ్యాప్తంగా శాస్త్రీయ కులగణన పూర్తి కావాలి
ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది.  ఇంత కీలకమైన అంశాలపై  దక్షిణాది  ప్రధాన రాజకీయ నాయకులు ఎందుకు గట్టిగా మాట్లాడడం లేదు?  చంద్రబాబు,  కేసీఆర్,  జగన్,  పవన్ కల్యాణ్ వంటి నాయకులు డీలిమిటేషన్, కులగణన, మహిళా రిజర్వేషన్లలో సామాజిక న్యాయం, దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై దేశవ్యాప్త చర్చను ఎందుకు కోరడం లేదు? ఆధిపత్య వర్గాలకు 10 శాతం ఆర్థిక రిజర్వేషన్ ఎలాంటి పెద్ద ప్రజా ఉద్యమం లేకుండానే అమలైనట్లే, ఈ అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా అనుకూల వాతావరణం ఏర్పడుతోందనే విమర్శలను విస్మరించలేం. అందువల్ల డీలిమిటేషన్‌‌కు ముందు నాలుగు ప్రాథమిక చర్యలు తప్పనిసరిగా జరగాలి.

దేశవ్యాప్తంగా శాస్త్రీయ కులగణన పూర్తి కావాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ముస్లింలు, క్రిస్టియన్ల రాజకీయ వాటాపై రాజ్యాంగబద్ధమైన విధానం రూపొందించాలి. ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక డీలిమిటేషన్ ప్రమాణాలు తీసుకురావాలి. అలాగే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా, ప్రాతినిధ్య లోటు ఉన్న రాష్ట్రాలు, సామాజిక వర్గాలకు టెలిస్కోపిక్ వెయిటేజీ ఇచ్చే కొత్త సూత్రాన్ని అమలు చేయాలి.

దేశ రాజకీయ సీట్ల కోసం పోరాటం
నీట్ కోసం జెన్-జీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రశ్న మరింత పెద్దది.  ఇది కాలేజీ సీట్ల కోసం కాదు.  దేశ రాజకీయ సీట్ల కోసం. ఇది ఒక తరం కోసం కాదు. తరతరాల కోసం.  అందుకే  ఇప్పుడు దేశ యువత,  ముఖ్యంగా బీసీ,  ఎస్సీ,  ఎస్టీ,  ఆదివాసీ, ముస్లిం, క్రిస్టియన్  యువత, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు కలిసి ఒకే డిమాండ్‌‌ను ముందుకుతేవాలి.  ముందు కులగణన, తర్వాత డీలిమిటేషన్. ముందు  రాజకీయ ప్రాతినిధ్య న్యాయం, తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు.  డీలిమిటేషన్ దేశ రాజకీయ సీట్ల కోసం జరిగే పోరాటం.

చట్టసభల్లో రాజకీయ సీట్లు కోల్పోతే తరతరాల పాటు బహుజన సమాజం నష్టపోతుంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు కాదు. అధికారంలో న్యాయమైన భాగస్వామ్యం కూడా. ఆ భాగస్వామ్యాన్ని బలహీనపరిచే  ఏ సంస్కరణ అయినా దేశ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే ఈ రోజు అడగాల్సిన అసలు ప్రశ్న.. నీట్‌‌పై వెనక్కి తగ్గిన మోదీ ప్రభుత్వం, అదే సమయంలో డీలిమిటేషన్ పేరుతో భారత రాజకీయ పటాన్ని నిశ్శబ్దంగా తిరిగి రాస్తోందా?

డా. జె. పూర్ణచంద్రరావు మాజీ డీజీపీ, ఐపీఎస్ రిటైర్డ్, జాతీయ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బీఎస్పీ

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

*  స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.