మనీలా: పశ్చిమాసియా యుద్ధంతో ఫిలిప్పీన్స్ తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరగడం, సరఫరాలో అంతరాయాలు కలగడంతో ప్రభుత్వం ‘ఎనర్జీ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. పశ్చిమాసియాలో యుద్ధపరిస్థితులు దేశ ఇంధన సరఫరా, ఆర్థిక వ్యవస్థకు తక్షణ ప్రమాదంగా మారాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ఇంధన శాఖకు విస్తృత అధికారాలను కట్టబెట్టారు. అందులో భాగంగా దేశంలోని ఇంధన నిల్వలను పారిశ్రామిక, గృహ అవసరాలకు సమానంగా పంపిణీ చేస్తారు. కొరతను సాకుగా చూపి వ్యాపారులు ధరలు పెంచకుండా కఠిన చర్యలు తీసుంటారు.
థర్మల్ పవర్ పెంచేందుకు చర్యలు
ఇంధన ఒప్పందాల కోసం ముందస్తుగా 15శాతం చెల్లింపులు చేయడానికి ఇంధన శాఖకు అనుమతి ఇచ్చారు. నిల్వలు దాచిపెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సరఫరా అంతరాయలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. రవాణా శాఖకు కూడా కీలక అధికారాలు ఇచ్చింది. ప్రజారవాణాకు ఇంధన సబ్సిడీలు ఇవ్వడం, టోల్ చార్జీలను తగ్గించడం లేదా నిలిపివేయడం, విమాన రుసుములను తగ్గించే అధికారం కట్టబెట్టింది.
ప్రపంచ గ్యాస్ సరఫరాలు ఒత్తిడిలో ఉండటంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఇంధన కార్యదర్శి షాన్ గారిన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచే ఈ తాత్కాలిక చర్య అమల్లోకి రావొచ్చని చెప్పారు. కాగా, ఫిలిప్పీన్స్‌లో ఎండలు తీవ్రమవ్వడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. దీంతో అత్యవసర పరిస్థితి ముగిసే వరకు ప్రజలు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
