ఫైజర్​ వ్యాక్సిన్​ వాడొచ్చు

ఫైజర్​ వ్యాక్సిన్​ వాడొచ్చు

నష్టాల కన్నా లాభాలే ఎక్కువున్నయ్​
అమెరికా గవర్నమెంట్​కు
ఎఫ్​డీఏ కమిటీ సిఫార్సు
వచ్చే వారం వ్యాక్సిన్​ను
ఎఫ్​డీఏ ఆమోదించే అవకాశం

వాషింగ్టన్: ఫైజర్​–బయోఎన్​టెక్​ కలిసి తయారుచేసిన కరోనా వ్యాక్సిన్​కు అమెరికాలో దాదాపు లైన్​ క్లియర్​ అయిం ది. వ్యాక్సిన్​తో లాభాలే ఎక్కువున్నాయని  అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​డీఏ) ఏర్పాటు చేసిన వ్యాక్సిన్స్ అండ్​ రిలేటెడ్​ బయోలాజికల్​ ప్రొడక్ట్స్​ అడ్వైజరీ కమిటీ(వీఆర్​బీపీఏసీ) చెప్పింది. ఎలాంటి జంకు లేకుండా జనానికి వ్యాక్సిన్​ వేయొచ్చని సిఫార్సు చేసింది. కమిటీలోని 17 మంది సభ్యులు వ్యాక్సిన్​ బాగుందని చెప్పగా, నలుగురు మాత్రం ఇంకా టెస్టులు చేయాల్సి ఉందన్నారు. ‘‘వ్యాక్సిన్​ బాగా పనిచేస్తోంది. దానితో మస్తు లాభాలున్నాయి. రిస్క్​ చాలా తక్కువ’’ అని కమిటీ మెంబర్​, ఫిలడెల్ఫియా చిల్డ్రెన్స్​ హాస్పిటల్​ వ్యాక్సిన్​ ఎక్స్​పర్ట్​ పాల్​ ఓఫిట్​ అన్నారు. కమిటీ సూచనలకు తగ్గట్టు వ్యాక్సిన్​ను ఎఫ్​డీఏ అధికారికంగా ఆమోదించడం ఒక్కటే మిగిలి ఉంది. కమిటీ సూచనలను ఎఫ్​డీఏ కెరీర్​ స్టాఫ్​ రివ్యూ చేస్తున్నారని, ఎమర్జెన్సీ వాడకంపై వాళ్లు తేల్చిన తర్వాత వెంటనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఎఫ్​డీఏ కమిషనర్​ స్టీఫెన్​ ఎం. హన్​ చెప్పారు. వ్యాక్సిన్​ను ఎఫ్​డీఏ ఆమోదించాక.. సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​కు చెందిన అడ్వైజర్లు వ్యాక్సిన్​ డేటాను మరోసారి పరిశీలించనున్నారు.

ఎయిడ్స్​ యాంటీబాడీలొచ్చినయ్​

కరోనా వ్యాక్సిన్​ వేస్తే.. కరోనా యాంటీబాడీలు రావాలి. కానీ, ఆస్ట్రేలియాలో కొందరు వాలంటీర్లకు హ్యూమన్​ ఇమ్యునో వైరస్(హెచ్​ఐవీ) ఎయిడ్స్​ యాంటీ బాడీలు తయారయ్యాయి. దీంతో ట్రయల్స్​ మొత్తాన్ని ఆస్ట్రేలియా సర్కార్ బంద్​ పెట్టేసింది. కరోనా వ్యాక్సిన్​ ఫేజ్​1 ట్రయల్స్​లో భాగంగా 216 మంది వలంటీర్లకు క్వీన్స్​ల్యాండ్​వర్సిటీ తయారు చేసిన వీ451 అనే కరోనా వ్యాక్సిన్​ను ఇచ్చారు. వాలంటీర్లు కొందరిలో ఎయిడ్స్​కు కారణమయ్యే హెచ్​ఐవీలోని ప్రొటీన్​ జీపీ41 ఆనవాళ్లు బయటపడ్డాయని వర్సిటీ, వ్యాక్సిన్ తయారీ కంపెనీలు చెప్పాయి. దీనిపై ప్రభుత్వం​తో చర్చించాక, ఫేజ్​2, ఫేజ్​3 ట్రయల్స్​ను ఆపేయాలని డిసైడ్​ అయ్యామని చెప్పాయి.