యాదాద్రి, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్ తరహాలో సాగదీస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని విధంగా ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. అసలు సూత్రధారులను కాకుండా ఆఫీసర్లను బలిపశువులుగా చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలని, ప్రజల దృష్టిని మళ్లించడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంల బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఆటలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ లీడర్లు బూర నర్సయ్యగౌడ్, గంగిడి మనోహర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఉట్కూరు అశోక్‌గౌడ్, చందా మహేందర్ గుప్తా పాల్గొన్నారు.
