- నందినగర్‌లోని ఆయన నివాసంలో అందించిన అధికారులు
- జనవరి 30న మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని ఆదేశాలు
- స్టేషన్‌కు వచ్చినా సరే, వేరే చోటైనా సరేనని వెల్లడి
- మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందున మరో తేదీ ఫిక్స్చేయాలని విజ్ఞప్తి
- కేసీఆర్ వినతిపై నేడు నిర్ణయం: సిట్ చీఫ్ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్
కేసీఆర్‌కు 160 సీఆర్‌పీసీ కింద సిట్ గురువారం నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉండగా.. బంజారాహిల్స్ నందినగర్‌లోని ఆయన నివాసంలో అధికారులు నోటీసులు అందించారు.
జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని లేదా హైదరాబాద్‌లో ఆయన సూచించిన ప్రాంతానికి తామే వస్తామని నోటీసుల్లో సిట్అధికారులు పేర్కొన్నారు. ఫోన్‌ట్యాపింగ్, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర అభియోగాలపై పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 2024 మార్చి10న నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇదే కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు, జోగినపల్లి సంతోష్‌రావును సిట్ ఇప్పటికే విచారించింది.
కాగా, ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా కేసీఆర్‌ను విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. నిందితులు, సాక్షులు, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ అంతిమ లబ్ధిదారు అప్పటి సీఎం కేసీఆర్‌గా సిట్ గుర్తించింది. ఈ మేరకు సేకరించిన ఆధారాలతో ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని నిర్ణయించింది. 65 ఏండ్లు వయసు, మాజీ ముఖ్యమంత్రి కావడంతో అధికారులు చట్టప్రకారం ముందుకెళ్తున్నారు.
పక్కా ఆధారాలతో విచారణకు ఏర్పాట్లు..
ఫోన్ట్యాపింగ్కేసు దర్యాప్తులో భాగంగా కేసీఆర్పాత్రపై సిట్ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి అందిన 618 ఫోన్నంబర్లతో కూడిన లిస్ట్ ఆధారంగా బాధితులు, సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.
ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సహా నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్‌రావును పలుమార్లు కస్టడీకి తీసుకుని విచారించింది. నాటి సీఎంవో ఆదేశాల మేరకే బీఆర్ఎస్ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, వ్యాపారవేత్తలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసినట్లు నిందితులు వెల్లడించారు.
మరోవైపు ప్రగతి భవన్ కేంద్రంగా ఫోన్‌ట్యాపింగ్ స్కెచ్ వేసినట్లు సంతోష్‌రావు సైతం స్పష్టం చేశారు. దీనికితోడు ఫాంహౌస్ కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్‌ట్యాపింగ్
జరిగినట్లు సిట్నిర్ధారణకు వచ్చింది. ఆనాడు సీఎం హోదాలో కేసీఆర్స్వయంగా ఆ ట్యాపింగ్ఆడియోలను బయటపెట్టడాన్ని ప్రధాన సాక్ష్యంగా సిట్పరిగణిస్తోంది. వీటన్నింటిపైనా కేసీఆర్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది.
ఏ నోటీసులైనా ఎర్రవల్లికే పంపండి: కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తాను సిట్ విచారణకు హాజరుకాలేనని కేసీఆర్తెలిపారు. ఈ మేరకు గురువారం సిట్ ఏసీపీ పి.వెంకటగిరికి రిప్లై ఇచ్చారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులను తానే ఫైనల్ చేయాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విచారణకు రాలేనని, మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు.
సీఆర్‌పీసీ సెక్షన్160 ప్రకారం.. 65 ఏండ్లు దాటిన వ్యక్తులు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని, కాబట్టి సిద్దిపేట జిల్లాలోని తన ఎర్రవల్లి (ఫాంహౌస్) నివాసానికే అధికారులు రావాలని కోరారు. విచారణకు వచ్చే ముందు మరోసారి నోటీసులు ఇవ్వాలని, భవిష్యత్తులో ఎలాంటి నోటీసులైనా ఎర్రవల్లి అడ్రసుకే పంపాలని విన్నవించారు. మాజీ సీఎంగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు.
నేడు (జనవరి 30) నిర్ణయం తీసుకుంటాం: సజ్జనార్
నోటీసులపై కేసీఆర్ ఇచ్చిన రిప్లై తమకు అందిందని, విచారణ తేదీ మార్పుతో పాటు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని ఆయన కోరారని సిట్చీఫ్ సజ్జనార్‌తెలిపారు. మళ్లీ నోటీసులు ఎప్పుడు ఇవ్వాలనే విషయంపై చర్చిస్తున్నామని, అసెంబ్లీ రికార్డులు, ఎలక్షన్ అఫిడవిట్‌లో నందినగర్ అడ్రస్ ఉన్నందున అక్కడే నోటీసులు ఇచ్చామన్నారు.
కాగా, కేసు నమోదైన పీఎస్‌కు సంబంధించి జ్యూరిడిక్షన్ పరిధిలోనే సాక్షి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుందని, దీనిపై ఎలా ముందుకెళ్లాలనే విషయంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
