- 2022 జులై నుంచి ఆయన ఫోన్‌ను మానిటరింగ్ చేసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం
- మధుసూదన్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. టెలికాం సర్వీసెస్ అందించిన ట్యాపింగ్ లిస్ట్‌తోపాటు ఎస్‌ఐబీ హార్డ్ డిస్క్ ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాధితులు, సాక్షుల స్టేట్‌మెంట్లను సిట్ సేకరిస్తుంది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శనివారం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. డీసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలోని సిట్ సభ్యుల బృందం ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది.
2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ట్యాపింగ్..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ లో మధుసూదన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. డీసీసీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. నాటి టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మధుసూదన్‌రెడ్డిపై నిఘా పెట్టింది. 2022 జులై 13 నుంచి మధుసూదన్ రెడ్డి ఫోన్‌తోపాటు పలువురు కీలక కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపు ఏడాదిపాటు మధుసూదన్ రెడ్డి ఫోన్‌ను మానిటరింగ్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది.
