
- ఆమె ప్రతిఘటించడంతో ఆక్సిజన్ తొలగించి భర్తను చంపేసిన డ్రైవర్, హెల్పర్
లక్నో : కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడుకోలేక బాధపడుతున్న మహిళపై అంబులెన్స్ డ్రైవర్, హెల్పర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మహిళ లొంగకపోవడంతో ఆమె భర్తకు ఆక్సిజన్ అందకుండా చేసి చంపేశారు. ఆపై బాధితురాలి దగ్గరున్న నగలు, డబ్బు, మొబైల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బన్సీ కొత్వాలీకి చెందిన ఓ మహిళ(35)..అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త హరీశ్(37)ను గత నెల 28న లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చింది. అక్కడ ట్రీట్మెంట్ కోసం ఎక్కువ డబ్బులు అడగటంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
ఆస్పత్రి సిబ్బంది సూచనతో మరుసటి రోజు ఓ ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుంది. సోదరుడు అనూప్ సాయంతో భర్తను తీసుకుని అంబులెన్స్‌లో ఇంటికి బయల్దేరింది. ముగ్గురూ అంబులెన్స్‌లో వెనక కూర్చున్నారు. కొంత దూరం వెళ్లాక అంబులెన్స్ డ్రైవర్, అతని హెల్పర్ వెనక్కి వెళ్లి మహిళను వెహికల్లో ముందు కూర్చోవాలని బెదిరించారు. దాంతో ఆమె డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంది. కాసేపటికి డ్రైవర్, హెల్పర్ మహిళను లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశారు.
మహిళ గట్టిగా అరవడంతో రాత్రి 11:30 ప్రాంతంలో బస్తీ జిల్లాలోని ఓ ఏరియాలో అంబులెన్స్ ఆపారు. వెంటనే హరీశ్ ఆక్సిజన్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. మహిళను కొట్టి ఆమె దగ్గరున్న బంగారు నగలు, రూ. 10 వేలు, ఫోన్ తీసుకున్నారు. బాధితురాలి సోదరుడు అనూప్ తన ఫోన్ నుంచి 112 , 108 నంబర్లకు కాల్ చేశాడు. వారు వెంటనే వచ్చి హరీశ్ ను ఆస్పత్రికి తరలించినా అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.