శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కంటే ముందే బయటికొచ్చిన ఫొటో

శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కంటే ముందే బయటికొచ్చిన ఫొటో
  • 51 అంగుళాల ఎత్తు..  150 కిలోల బరువు
  • ఇప్పటికే గర్భగుడిలో కొలువైన బాల రాముడు
  • మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో రూపుదిద్దుకున్న విగ్రహం

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గర్భగుడిలోకి చేరిన రామ్​లల్లా విగ్రహ ఫొటోలు శుక్రవారం బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాల పొడువున్న రామ్​లల్లా విగ్రహం అందరినీ ఆకట్టుకుంటున్నది. చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకుని బాల రాముడు పీఠంపై నిలబడి ఉన్నాడు. విగ్రహం బరువు 150 కిలోల వరకు ఉంటుందని, ఐదేండ్ల వయస్సులో రాముడు ఎలా ఉన్నాడో.. ఈ విగ్రహాన్ని చూస్తే అర్థం అవుతుందని ఆలయ ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు విగ్రహాలను రూపొందించగా.. మైసూర్​కు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు ఫైనల్ చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. మరోవైపు అయోధ్య మొత్తం లైటింగ్స్​తో వెలిగిపోతున్నది. ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించి లైట్లు ఏర్పాటు చేశారు.

అయోధ్య (యూపీ): అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే, గర్భగుడిలో ప్రతిష్ఠించే రామ్​లల్లా విగ్రహ ఫొటోలు శుక్రవారం బయటికి వచ్చాయి. రామ మందిర ప్రారంభోత్సవం కంటే ముందే బాలరాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిస్తున్నది. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తన ట్విట్టర్​లో రాముడి విగ్రహ ఫొటోను షేర్ చేశారు. ‘బాలరాముడి తొలి చిత్రం. దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది’ అంటూ ఆమె రాసుకొచ్చారు. కృష్ణ శిలతో 51 అంగుళాలతో చెక్కిన రామ్​లల్లా విగ్రహం అందరినీ ఆకట్టుకుంటున్నది. చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకుని బాల రాముడు పీఠంపై నిలబడి ఉన్నాడు. ఐదేండ్ల వయస్సులో రాముడు ఎలా ఉన్నాడో.. ఈ విగ్రహాన్ని చూస్తే అర్థం అవుతుందని ఆలయ ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు.

అయోధ్యకు చేరుకున్న హనుమంతుడి రథం

రెండు నెలల పాటు దేశంలోని అనేక ఆలయాల్లో ఊరేగించిన ప్రత్యేక రథం శుక్రవారం అయోధ్యలోని సరయూ నది ఒడ్డుకు చేరుకుంది. నేపాల్​లో ఉన్న సీతాదేవి జన్మస్థలమైన జనక్​పూర్ కు కూడా వంద మంది భక్తుల బృందం ఈ రథాన్ని తీసుకెళ్లింది. జనక్​పూర్ నుంచి హనుమంతుడి జన్మస్థలమైన కిష్కింధ మీదుగా అయోధ్యకు తీసుకొచ్చారు. రాముడి భజనలు, ‘జైశ్రీరామ్’ నినాదాలు, పాటలు పాడుతూ రథాన్ని రెండు నెలలు ఊరేగించారు. ఈ నెల 25 దాకా రథం అయోధ్యలోనే ఉంటుందని శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అభిషేక్ కృష్ణ శాస్త్రి తెలిపారు. రథంలో హనుమంతుడిని శ్రీరాముడు కౌగిలించుకున్న విగ్రహం ఉందని చెప్పారు. యాత్రలో సేకరించిన విరాళాలతో కిష్కింధలో 215 అడుగుల హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఆరేండ్లలో రూ.1,200 కోట్లతో విగ్రహం నిర్మించాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

మహారాష్ట్ర నుంచి 500 కిలోల కుంకుమ ఆకులు

ఈ నెల 22న జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకల కోసం ఐదు వందల కిలోల కుంకుమ ఆకులు అయోధ్యకు చేరుకున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇవి వచ్చాయని ఆలయ బోర్డు సభ్యులు తెలిపారు. శ్రీరాముడి భక్తులైన రాజేశ్వర్ మౌలి, జితేంద్రనాథ్ మహారాజ్ ఈ కుంకుమ ఆకులు పంపారు. గురువారం అమరావతి నుంచి వీరంతా బయలుదేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ఎంపీ నవనీత్ రాణా పాల్గొన్నారు. కుంకుమ ఆకులు.. దేశ సామాజిక, మతపరమైన ప్రాముఖ్యతను తెలియజేస్తాయని రాణా చెప్పారు.

జైళ్లలో ప్రాణ ప్రతిష్ఠ లైవ్ టెలికాస్ట్

ఉత్తరప్రదేశ్​లోని జైళ్లలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను లైవ్​లో చూపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా భజనలు కూడా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

అయోధ్య తీర్పు చెప్పిన  జడ్జిలకు ఇన్విటేషన్

2019లో అయోధ్య తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ వేడుకల ఆహ్వానాలు అందాయి. అప్పటి సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌‌ఏ బోబ్డే , ప్రస్తుత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్‌‌లో జస్టిస్‌‌లు అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్​లకు ఇన్విటేషన్ అందింది. అయోధ్య భూ వివాదం కేసులో మాజీ న్యాయవాది ఇక్బాల్ అన్సారీకి కూడా  22న జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందింది.

బంగారంతో సూక్ష్మ రామ మందిరం

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్​కు చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి మరోసారి తన ప్రతిభ చాటాడు. అయోధ్య మందిర నమూనాను బంగారంతో తయారు చేశాడు. కేవలం 2.730 మిల్లీ గ్రాముల బంగారంతో రామ మందిరం నమూనా, 118 స్థంబాలు, 20 గోపురాలు, విల్లును తయారు చేశాడు. - అమ్రాబాద్, వెలుగు

అయోధ్యకు సాహసయాత్రలు

22 న జరిగే అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి మతాలకు అతీతంగా ప్రజలు తరలివస్తున్నారు. కొందరు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో బయలుదేరగా.. మరికొందరు కాలినడకన, సైక్లింగ్, స్కేటింగ్ ద్వారా అయోధ్యకు చేరుకున్నారు.

కాంగ్రెస్ నేతలకు అయోధ్యకు వచ్చే అర్హత లేదు

రాముడి ఉనికిని గుర్తించని కాంగ్రెస్ నేతలకు అయోధ్య వేడుకల్లో పాల్గొనే అర్హత లేదని బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిష్ఠాపన ఇన్విటేషన్ ను కాంగ్రెస్ తిరస్కరించడంపై తీప్రస్థాయిలో మండిపడ్డారు."కాంగ్రెస్ నేతలు రాముడిని తిరస్కరించారు. సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌‌ ద్వారా అయోధ్యలో  రాముడు లేడంటూ ఆయన ఉనికిని  తిరస్కరించారు. అందుకే వారికి అయోధ్యకు వెళ్లే ధైర్యం లేదు" అని ఉమాభారతి పేర్కొన్నారు.

నల్లరాతితో విగ్రహాన్ని చెక్కిన శిల్పి

మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్.. రామ్​లల్లా విగ్రహాన్ని చెక్కారు. నల్లరాతితో రూపొందించిన ఈ విగ్రహం.. 51 అంగుళాల ఎత్తు, 150 కిలోల బరువు ఉంటుందని ట్రస్ట్ సభ్యు లు వివరించారు. గురువారమే విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లిన పండితులు ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. విగ్రహం పూర్తయ్యే వరకు శిల్పి అరుణ్ యోగిరాజ్ దీక్షలో ఉన్నారు. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. విశ్వ హిందు పరిషత్ (వీహెచ్​పీ) సభ్యులు కూడా రాముడి విగ్రహ ఫొటోను రిలీజ్ చేశారు.

ఏర్పాట్లపై యోగి సమీక్ష

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు రాముడి ఆలయాన్ని సందర్శించి, ప్రాణ ప్రతిష్ఠ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత సరయూ నదిలో సోలార్ బోట్ సర్వీసును ప్రారంభించి అందులో ప్రయాణించారు.

22న పలు రాష్ట్రాల్లో హాఫ్ డే సెలవు

ఈనెల 22న త్రిపుర, మధ్యప్రదేశ్‌‌, గుజరాత్‌‌, రాజస్థాన్ రాష్ట్రాలు శుక్రవారం హాఫ్ డే సెలవు ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, సంస్థలు, విద్యాసంస్థలు మధ్యాహ్నం 2.30 గంటల వరకు ముసివేయనున్నారు. ఇప్పటికే  ఉత్తరప్రదేశ్, హర్యాణా, చత్తీస్​గఢ్, అస్సాం, గోవా, ఒడిశా రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు  22వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బ్యాంకులకూ వర్తింపజేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకూ సెలవు వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది.

ప్లాస్టిక్ వాడకంపై ఆంక్షలు..

వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై అధికారులు నిషేధం విధించారు. అతిథులకు ప్రత్యేకంగా తయారుచేసిన ప్లేట్లలో ఆహార పదార్థాలను వడ్డించనున్నారు.

300 అడుగుల దీపం..

  • ప్రపంచంలోనే అతిపెద్ద దీపాన్ని జనవరి 22న రామ మందిర ప్రాంగణంలో వెలిగిస్తారు...
  • అయోధ్య రామమందిర ప్రసాదం పేరుతో అమ్మకాలు చేపట్టిన ఆన్ లైన్ ప్లాట్‌‌ ఫాం అమెజాన్ పై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

రామయ్యకు కానుకల వెల్లువ..

ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్య రాముడికి దేశవిదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నా యి. లడ్డూలు, ప్రత్యేకంగా తయారుచేసిన కన్నౌజ్ నుంచి అత్తర్లు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమతో పాటు పలు రకాల ధాన్యం, భోపాల్ నుంచి పూలు, 500 కిలోల ఇనుముతో తయారు చేసిన భారీ నగారా, విల్లంబులు, ఓనవిల్లు తదితర కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి.

అయోధ్యకు రామ రథం బస్సులు..

లక్నో, వారణాసి, గోరఖ్ పూర్, ప్రయాగ్​రాజ్, బాలియ నుంచి రామరథం పేరుతో అయోధ్యకు ప్రత్యేక బస్సులు..  రామమందిరం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బాల రాముడి విగ్రహంతో పాటు ఇప్పటి వరకు పూజలు అందుకున్న విగ్రహాన్ని కూడా టెంపుల్​లో గర్భగుడిలో ఉంచుతామని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పష్టతనిచ్చారు. ప్రాణప్రతిష్ఠ వేడుక పూర్తయ్యాక ఆ రెండు మూర్తులూ భక్తుల పూజలందుకుంటాయని తెలిపారు.