నిర్భయ దోషుల్ని త్వరగా ఉరి తీయండి: సుప్రీంలో పిల్

నిర్భయ దోషుల్ని త్వరగా ఉరి తీయండి: సుప్రీంలో పిల్

నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషుల్ని త్వరగా ఉరి తీయాలని కోరుతూ శుక్రవారం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దాదాపు ఏడేళ్లుగా సాగుతున్న ఈ కేసు దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ తనను ఉరి శిక్ష నుంచి తప్పించాలని రివ్యూ ఫైల్ చేసిన నేపథ్యంలో సుప్రీం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. దోషులు రివ్యూలు, క్యూరేటివ్ పిటిషన్లపై నెల లోపే తేల్చాలని కోరారు పిటిషనర్. లీగల్ ప్రొసీజర్ వేగంగా పూర్తి చేసి నిర్భయ దోషులు నలుగురిని ఉరి తీయాలన్నారు.

రెండేళ్ల క్రితమే ఖరారైన ఉరి

2012 డిసెంబరు 16న ఢిల్లీలో ఓ యువతి (నిర్భయ)ని కిడ్నాప్ చేసి రన్నింగ్ బస్సులో ఆరుగురు కలిసి దారుణంగా రేప్ చేశారు. అత్యాచారం చేస్తూ పైశాచికంగా హింసించి.. రోడ్డుపై పడేసి పరారయ్యారు. ఆమె చికిత్స పొందుతూ 2012 డిసెంబరు 29న మరణించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులు రామ్ సింగ్(33), ముకేష్ సింగ్(24), , వినయ్ శర్మ(22), పవన్ గుప్తా(20) , అక్షయ్ ఠాకూర్(29), మరో మైనర్ నిందితుడు మహ్మద్ అఫ్రోజ్(17సంవత్సరాల 6నెలలు)ను పోలీసులు అరెస్టు చేశారు.

అఫ్రోజ్ మైనర్ కావడంతో జువైనల్ కోర్ట్  మూడు సంవత్సరాల జైలుశిక్షతో బయటపడ్డాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ 2013మార్చ్ 11న తీహార్ జైల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లకు ఉరిశిక్షే సరైందని ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్ 13న తీర్పు చెప్పింది. 2017 మే 5న ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఒక్కొక్కరుగా పిటిషన్లు

దిశ కేసు సంచలనమైన తర్వాత నిర్భయ దోషులు నలుగురికి త్వరలోనే ఉరి వేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శిక్ష అమలు ఆలస్యం చేసేందుకు దోషులు ఒక్కొక్కరుగా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు వేస్తున్నారు. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్​ కుమార్​ సింగ్​ వేసిన రివ్యూ పిటిషన్​ను సుప్రీం కోర్టు ఈ నెల 17న విచారించనుంది. ముగ్గురు జడ్జిలున్న బెంచ్​ పిటిషన్​ను విచారించబోతున్నారు. మరోవైపు పవన్ గుప్తా తండ్రి కూడా తాను పిటిషన్ వేయబోతున్నట్లు రెండ్రోజుల క్రితం చెప్పాడు.

MORE NEWS:

ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్

రేప్‌లు జరగొద్దంటే..  మగవాళ్లు ఇలా చేయాలి

థియేటర్‌లోకి బయటి ఫుడ్ తీసుకెళ్లొచ్చు: అడ్డుకుంటే ఏం చేయాలి?