ప్రియురాలి సరదా తీర్చాడు.. రూ. 30 లక్షల ఫైన్ కట్టాడు

ప్రియురాలి సరదా తీర్చాడు.. రూ. 30 లక్షల ఫైన్ కట్టాడు

ఎయిర్ ఇండియా ఇటీవల వరసగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన ఆ సంస్థ పరువు తీసింది. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విమానయాన సంస్థలకు జరిమానా విధించింది. ఇదిలా ఉంటే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఓ పైలెట్ తన మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. దీనిపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది.

పైలట్ కు రూ. 30 లక్షలు ఫైన్

స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించిన పైలట్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సస్పెండ్‌ చేసింది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఎయిర్‌ ఇండియా సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న దుబాయ్‌-ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానంలో ఆ సంస్థకు చెందిన ఉద్యోగిని ప్రయాణించింది. అయితే స్నేహితురాలైన ఆ మహిళను కాక్‌పిట్‌లోకి పైలట్‌ ఆహ్వానించాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆ విమానానికి చెందిన మొత్తం సిబ్బందిని గ్రౌండ్‌ చేసింది.

అంతా కాక్‌పిట్‌లోనే

ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో చేరాల్సిందిగా పైలట్ అదే విమానంలో ప్రయాణీకురాలిగా ఉన్న తన మహిళా స్నేహితురాలిని ఆహ్వానించాడని, ఆ మహిళ ప్రయాణసమయం అంతా కాక్ పిట్ లోనే ఉండిపోయిందని అధికారి తెలిపారు. దాదాపు మూడు గంటలపాటు సాగినట్లు అధికారులు తెలిపారు. 

డీజీసీఏ చర్యలు

ఈ సంఘటనకు సంబంధించిన దర్యాప్తుపై నివేదిక అందడంతో డీజీసీఏ చర్యలు చేపట్టింది. దీనిని తీవ్రమైన తప్పిదంగా పరిగణించింది. స్నేహితురాలైన మహిళను కాక్‌పిట్‌లోకి అనుమతించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఇంచార్జ్‌ పైలట్‌ లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్‌ చేసింది. ఈ సంఘటనను నివారించని కోపైలట్‌కు వార్నింగ్‌ ఇచ్చింది.  భద్రతాపరమైన, సున్నితమైన ఈ అంశానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్‌ ఇండియా సంస్థకు డీజీసీఏ చీవాట్లు పెట్టింది. సత్వర దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. అలాగే ఆ విమానంలోని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎయిర్‌ ఇండియాను ఆదేశించింది.