తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రమాణస్వీకార కార్యక్రమంపై విమర్శలు మొదలయ్యాయి. 40 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించిన సీపీఐ(ఎం) పార్టీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ ఎన్నికల సమయంలోనే ప్రకటించింది. చెప్పినట్లే రెండోసారి గెలవడంతో ముఖ్యమంత్రి కాబోతున్న పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం ఈనెల 20వ తేదీన జరపాలని నిర్ణయించారు. సీఎంతోపాటు 21 మంది మంత్రివర్గ సహచరులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరపాలన్న నిర్ణయం విమర్శలకు దారితీస్తోంది. ఈ స్టేడియం కెపాసిటీ 1000 కాగా, 500 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎ.విజయరాఘవన్ ప్రకటించారు. అయితే విజయన్ నిర్ణయంపై సోషల్‌మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత కరోనా సమయంలో ప్రమాణ స్వీకారాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించాల్సిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయన్‌ను కోరినా పట్టించుకో లేదు. బహిరంగంగా స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కట్టడిలో దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేరీతిలో నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం విషయంలో ఇలా చేయడం సరికాదంటూ నెటిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
