స్టూడెంట్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్లానింగ్​ ముఖ్యం : కిశోర్​బాబు

స్టూడెంట్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్లానింగ్​ ముఖ్యం :  కిశోర్​బాబు

సికింద్రాబాద్, వెలుగు: స్టూడెంట్లు లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రణాళికాబద్ధంగా చదువులు కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, రైల్వే డిగ్రీ కాలేజీ చైర్మన్ పి.కిశోర్​బాబు చెప్పారు. బుధవారం నిర్వహించిన రైల్వే డిగ్రీ కాలేజీ 47వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిశోర్ బాబు మాట్లాడుతూ.. జీవితంలో ఏమి సాధించాలో ముందుగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలని స్టూడెంట్లకు సూచించారు. రైల్వే కాలేజీకి ఎంతో చరిత్ర ఉందని, దేశంలో ఎక్కడా రైల్వేశాఖకు డిగ్రీ కాలేజీ లేదని చెప్పారు. ఇక్కడ చదివిన ఎంతో మంది గొప్ప స్థానాల్లో ఉన్నారని తెలిపారు. 

రైల్వే కాలేజీ స్టూడెంట్లు చదువుతోపాటు అన్నింటిలో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నారని ప్రశంసించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ భాష్యం మాట్లాడుతూ.. స్టూడెంట్లు అన్నిరంగాల్లో రాణించేలే కృషి చేస్తున్నామని చెప్పారు. క్రీడా పోటీల్లో అనేక ట్రోఫీలు సాధించారని గుర్తు చేశారు. త్వరలో కాలేజీలో బాస్కెట్ బాల్ గ్రౌండ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.  

కల్నల్ నగేశ్ చంద్రగుప్తా పేద విద్యార్థుల పరీక్షా ఫీజు, కాలేజీ ఫీజును చెల్లించేందుకు ముందుకు వచ్చి, దాదాపు రూ.9లక్షలు అందజేశారని తెలిపారు. అనంతరం చదువుతోపాటు క్రీడలు, ఇతర రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన స్టూడెంట్లకు బహుమతులు పంపిణీ చేశారు. కాలేజీ సావనీర్ ను   ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు డ్యాన్సులతో అదరగొట్టారు. కార్యక్రమంలో కాలేజీ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సోపన్ కాశీనాథ్, అధ్యాపకులు,  ఉద్యోగులు పాల్గొన్నారు.