
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రోడ్లు వేయడంతో పాటు పాడై పోయిన రోడ్లను బాగు చేస్తున్నారు. అయితే సీఎం పర్యటన కోసం రోడ్లకు రెండువైపులా ఇష్టమొచ్చినట్టు చెట్లు నాటడంపై విమర్శలు వస్తున్నాయి.
సీఎం కేసీఆర్ ఈ నెల 4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మండేపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, సర్దార్ పూర్ లోని నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు, రగుడు సమీపంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను ఆయన ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కొత్త రోడ్లను వేస్తున్నారు. పాడైన రోడ్లను హడావుడిగా బాగు చేస్తున్నారు. అయితే తంగళ్ళపల్లి మండల కేంద్రం నుంచి టెక్స్ టైల్ పార్క్ వరకు రోడ్డు పక్కనే ఇష్టమొచ్చినట్టు చెట్లు నాటి ప్రజాధనం వృథా చేస్తున్నారంటున్నారు ప్రతిపక్షనేతలు.
సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా కేంద్రాలను కలుపుతూ నాలుగు వరుసల రహదారి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం లభిస్తుందని టీఆర్ఎస్ నేతలు చెబ్తున్నారు. దీంతో రోడ్డు పక్కనే మొక్కలు నాటడం కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసం, TRS నాయకులకు చెందిన నర్సరీలకు బిల్లుల రూపంలో దోచి పెట్టడానికే ఆరోపిస్తున్నారు మరికొందరు ప్రతిపక్షనేతలు. విస్తరించేబోయే రోడ్ల పక్కన చెట్లు నాటడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనతో జిల్లాకు ఒరిగేదేమీ లేదంటున్నారు ప్రతిపక్షనేతలు. స్వయానా సీఎం కొడుకు, మంత్రిగా ఉన్న జిల్లాలో చాలా అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని ఆరోపిస్తున్నారు.