సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లా చేయాలి

సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లా చేయాలి

ముషీరాబాద్, వెలుగు: లష్కర్(సికింద్రాబాద్)ను జిల్లా చేయాలని లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు పవన్ కుమార్ గౌడ్, బాల్ రాజ్ యాదవ్, సునీల్ ముదిరాజ్, జగదీష్ గౌడ్ డిమాండ్​చేశారు. గురువారం రాంనగర్​లోని ఇంట్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. 1959 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ వేర్వేరుగా ఉండేవని, తర్వాత కలిపేశారని గుర్తుచేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం.. సికింద్రాబాద్​ను పట్టించుకోలేదన్నారు. 15 నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే అత్యధిక జనాభాతో హైదరాబాద్ జిల్లాగా కొనసాగుతోందని, నిధులు, అధికారుల కొరతతో సికింద్రాబాద్ ప్రాంతం వెనుకబడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధితోపాటు, పరిపాలన సౌలభ్యం కోసం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు అశోక్ చారి, రవీందర్ సాగర్, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.

క్యాన్సర్ సెంటర్ పరిశీలన

మెహిదీపట్నం: లక్డీకాపూల్ లోని ఎం.ఎన్.జే క్యాన్సర్​హాస్పిటల్​ను హర్యానా గవర్నర్​బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్​రాజనర్సింహ గురువారం సందర్శించారు. అక్కడి శానిటేషన్, సెక్యూరిటీ అండ్ క్యాన్సర్ నివారణ అవగాహన సెంటర్ ను పరిశీలించారు. శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడాదన్నరగా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను వారికి వివరించారు. అనంతరం దత్తాత్రేయ, దామోదర్ రాజనర్సింహ క్యాన్సర్ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శరత్ అద్దంకి, ట్రస్టీ మిక్ గల్లెర్, ప్రోగ్రాం డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.