
- మూడు గంటల పాటు అయోధ్యలో మోడీ
- నలుగురు అతిథులు మాత్రమే స్టేజ్‌పైన
- మొత్తం 175 మందికి ఆహ్వానం
అయోధ్య: దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిటీలోని ఆలయాను, సరయూ నదీ తీరాన్ని తీర్చిదిద్దారు. మోడీ వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ అయోధ్యలో దాదాపు 3 గంటల పాటు గడపనున్నారు. బుధవారం ఉదయం స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి లక్నో చేరుకుంటారు. అక్కడ నుంచి స్పెషల్ చాపర్‌లో అయోధ్యకు వెళ్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరయూ నది తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో చాపర్ దిగుతుందని అధికారులు చెప్పారు. ప్రధాని మోడీ మొదట హనుమాన్ గిరి ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడ దాదాపు 10 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత రామమందిరం నిర్మాణానికి సంబందించి శంకుస్థాపన చేయనున్నారు. 40కేజీల వెండి ఇటుకతో భూమి పూజ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో కేవలం 175 మంది అతిథులకు మాత్రమే ఇన్విటేషన్ పంపారు. వారిలో 135 మంది పూజారులు, మత గురువులే. మోడీతోపాటు కేవలం నలుగురు మాత్రమే స్టేజ్‌ను పంచుకుంటారని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని నేషనల్ చానల్ దూర్‌దర్శన్ ద్వారా టెలికాస్ట్ చేయనున్నారు. ఈ శంకుస్థాపనతో బీజేపీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేరనుంది.
రాముడి పుట్టిన ముహూర్తంలోనే
రాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తాన్నే అయోధ్య రామ మందిర భూమి పూజకు ముహూర్తంగా నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్విటేషన్ కార్డుపై స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు మొదలయ్యాయి. సోమవారంఉదయం గణేశ్ పూజతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.