పేదరికమే పెద్ద కులం.. ప్రధాని మోదీ భావోద్వేగం

పేదరికమే పెద్ద కులం..  ప్రధాని మోదీ భావోద్వేగం

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్దమవుతోంది. తన కూటమి యూపీఏ పేరును ఇండియాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇందులో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ పార్టీల ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

ఎన్డీఏ కూటమి ఎంపీలతో సమావేశంలో  భాగంగా ప్రధాని మోదీ తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, దక్షిణాది రాష్ట్రాలు, బీహార్, ఒడిశా, జార్ఖండ్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ఐదు కీలక సూత్రాలను పాటించాల్సిందిగా ఎంపీలకు సూచించారు. ఈ సూత్రాలను ఎట్టిపరిస్థితుల్లో ఎంపీలు పాటించాల్సిందేనని..అలాగైతేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఆదేశాలు జారీ చేశారు. 


ఎంపీలకు మోదీ చేసిన ఐదు సూచనలివే..

రామ మందిరానికి ఓట్లు రావు..

ఆయోధ్యలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రామ మందిరాన్ని  నిర్మిస్తోందని..ఈ ఆలయాన్ని వచ్చే ఏడాది 2024 జనవరిలో ప్రారంభిస్తామన్నారు. అయితే ఈ మందిరం ద్వారా ఓట్లు పడతాయని తూర్పు ఉత్తర ప్రదేశ్ ఎన్డీఏ ఎంపీలు ఆశిస్తున్నారని..కానీ మందిరం పేరు చెప్తే ఓట్లు రావని  స్పష్టం చేశారు. రామ మందిరం సైద్ధాంతిక దృక్కోణంగా నిర్మితమవుతుందని..ఎన్నికల కోసం కాదని మోదీ ఎంపీలకు వెల్లడించారు. కాబట్టి ఎంపీలు రామ మందిరం పేరు చెప్తే ఓట్లు రావన్నారు. అలాగే ఆర్టికల్ 370 రద్దును కూడా చెప్పి ఓట్లు అడుగుతామంటే కుదరదన్నారు. చేసిన అభివృద్ధిని వివరించి..ఓట్లు రాబట్టుకోవాలన్నారు. 

పేదరికం అతి పెద్ద కులం..

మహారాష్ట్ర సదన్ లోని ఎంపీలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ..పేదల కోసం పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. గరిబీ సబ్లే బడి జాతీ హై (పేదరికం అతిపెద్ద కులం) అని..ఎంపీలకు వివరించారు.  యూపీ, బీహార్ లలో కులం అంశం అతి సున్నితమైన అంశమని..ఆయా రాష్ట్రాల ఎంపీలు కులాల కంటే పేదరికానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి..ఓట్లు అడగాలన్నారు. పేదలు సద్వినియోగం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు సంపాదించాలన్నారు. 

విపక్ష కూటమిని ఇండియాగా పిలవొద్దు..

కాంగ్రెస్ సహా విపక్ష కూటమి పేరును ఇండియాగా మార్పు చేసుకున్న క్రమంలో..ఈ అంశాన్ని  ఎన్డీఏ ఎంపీల దగ్గర  ప్రధాని మోదీ ప్రస్తవించలేదు. అయితే యూపీఏ కూటమి గతంలో కుంభకోణాలతో కళంకితమైంది కాబట్టి..దాని పేరు మార్చారని..మోదీ అన్నట్లు  పశ్చిమబెంగాల్ బలూర్ ఘాట్ ఎంపీ సుకాంత్ మజుందార్  వెల్లడించారు. ఇప్పటికే మోదీ ఇండియా కూటమికి ఘమండియా అనే పేరు పెట్టారని. అదే పేరుతో తామంతా పిలుస్తామన్నారు. 

వివాదాలు..వివాదాస్పద మాటలకు దూరంగా ఉండాలి..

అధికారపక్ష సభ్యులు అనవసర వివాదాల జోలికి వెళ్లొద్దని ప్రధాని మోదీ సూచించారు. మాట్లాడే సమయంలో  అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యాలకు దూరంగా ఉండాలని... అనవసరంగా మాట తూలొద్దని హెచ్చరించారు. అసందర్భంగా మాట్లాడొద్దన్నారు.  ప్రతిపక్షాలు నిరుత్సాహంలో ఉన్నాయని..వారు  మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తారని సూచించారు.  అందువల్ల  పార్లమెంట్ సభ్యులు ప్రతి మాటా అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలని... ఎలాంటి ట్రాప్‌లో పడొద్దని ప్రధాని మోదీ ..ఎన్డీఏ  ఎంపీలను ఆదేశించారు. 


ప్రజలతో మమేకం అవ్వండి..కాల్ సెంటర్లు ఏర్పాటు చేయండి..

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పక్ష ఎంపీలు  క్షేత్రస్థాయిలో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తూర్పు యూపీ ఎంపీలను ఆదేశించారు.  పార్లమెంట్ సమావేశాలు, లేదా పార్టీ విధుల్లో  ఉన్నప్పుడు ఎంపీలు ప్రజలకు దూరంగా ఉంటారని..ఈ సమయంలో ప్రజలకు కాల్ సెంటర్ల ద్వారా అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తూ... ప్రతిపక్షాల అవాస్తవ ఆరోపణలకు కౌంటర్‌ ఇవ్వాలన్నారు. ప్రతీ ఎంపీకి ప్రొఫెషన్ సోషల్ మీడియా టీమ్స్ ఉండాలన్నారు. సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉండాలన్నారు.