కేరళంను దోచుకుంటున్నరు.. ఎల్డీఎఫ్‌‌, యూడీఎఫ్‌‌ నేతలపై ప్రధాన మంత్రి మోదీ ఆరోపణలు

కేరళంను దోచుకుంటున్నరు.. ఎల్డీఎఫ్‌‌, యూడీఎఫ్‌‌ నేతలపై ప్రధాన మంత్రి మోదీ ఆరోపణలు
  • కేరళం స్వార్థ రాజకీయాల్లో చిక్కుకుపోయింది
  • రాష్ట్ర అప్పు రూ.5 లక్షల కోట్లు దాటింది
  • పాలక్కాడ్​లో ఎన్నికల ప్రచారం
  • పశ్చిమాసియా యుద్ధంపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి
  • ప్రభుత్వం చేసే ప్రకటనలనే నమ్మాలి
  • ప్రవాస భారతీయుల భద్రతే తమ ప్రాధాన్యమని వెల్లడి
  • మన్ కీ బాత్లో మోదీ సందేశం

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో  ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.   గత నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లను సృష్టించిందని తెలిపారు. ఆదివారం 132వ ‘మన్‌‌ కీ బాత్‌‌’  కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని  కోరారు. గత కొద్దికాలంగా ప్రపంచ వేదికపై మార్చి నెల అత్యంత ‘కల్లోలభరితంగా’ గడిచిందని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి సృష్టించిన కష్టాల నుంచి ప్రపంచం కోలుకుని, కొత్త వేగంతో ముందుకు సాగుతుందని భావించిన తరుణంలో.. వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు చెలరేగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

గల్ఫ్‌‌ దేశాలకు కృతజ్ఞతలు
పశ్చిమాసియాలో గత నెల రోజులుగా సాగుతున్న భీకర యుద్ధంపై ప్రధాని స్పందిస్తూ.. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయుల భద్రతపై ఆకాంక్ష వ్యక్తం చేశారు. ‘‘పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల లక్షలాది భారతీయ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అక్కడ నివసిస్తున్న మన సోదర సోదరీమణులకు అండగా ఉంటున్న గల్ఫ్ దేశాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా” అని పేర్కొన్నారు.   ప్రవాస భారతీయుల భద్రతే తమకు ప్రాధాన్యం అని తెలిపారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తుతున్నదని, అయితే భారత్ దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు.

గత దశాబ్ద కాలంలో భారత్ నిర్మించుకున్న అంతర్జాతీయ సంబంధాలు, దేశీయ సామర్థ్యమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ క్లిష్ట సమయంలో ఎవరూ రాజకీయం చేయవద్దని హెచ్చరించారు.140 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాల దృష్ట్యా స్వార్థ రాజకీయాలకు ఇది సమయం కాదని హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే రూమర్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

దేశంలోని జ్ఞాన సంపదను వెలికితీయాలి..
భారతీయ ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, రాతప్రతులను భద్రపరిచేందుకు  ‘జ్ఞాన్ భారతం’ యాప్‌‌ను తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని అపారమైన జ్ఞాన సంపదను వెలికితీసేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎవరి దగ్గరైనా పురాతన రాతప్రతులు ఉంటే వాటిని ఈ యాప్‌‌లో అప్‌‌లోడ్ చేయాలని సూచించారు.

కేరళను ఎల్డీఎఫ్‌‌, యూడీఎఫ్‌‌ లూటీ చేస్తున్నయ్​.. 
కేరళలో ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాలక్కాడ్‌‌లో పర్యటించారు. బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అధికార పక్షం ఎల్డీఎఫ్‌‌, ప్రతిపక్షం యూడీఎఫ్‌‌ కలిసి ఏండ్లుగా కేరళను దోచుకుంటున్నాయని మండిపడ్డారు.  కేరళ అప్పులు గత పదేండ్లలో 3 రెట్లు పెరిగి రూ. 5 లక్షల కోట్లకు చేరాయని, ఆ డబ్బంతా ఎల్డీఎఫ్‌‌ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.

జల సంరక్షణలో ముదిగుంట ఆదర్శం
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముదిగుంట గ్రామం జల సంరక్షణలో దేశానికే ఆదర్శమని ప్రధాని మోదీ అభినందించారు. ‘‘ముదిగుంటలోని 400 కుటుంబాలు తమ ఇళ్లలోనే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నాయి. ఫలితంగా, అక్కడ భూగర్భ జలమట్టం పెరిగింది. కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు తగ్గాయి. ఇది నిజమైన ప్రజా ఉద్యమం" అని మోదీ ప్రశంసించారు. సూర్యాపేటకు చెందిన కోట్ల రఘువీర్ రెడ్డి రైతుల సంక్షేమంపై రాసిన వ్యాసం తనను ఆకట్టుకుందని కొనియాడారు.