- పాక్, ఇండియా యుద్ధాన్ని ఆపానని మళ్లీ చెప్పుకున్న ట్రంప్
- స్కిల్ ఉన్నోళ్లను ఆహ్వానిస్తున్నామని వెల్లడి
వాషింగ్టన్: ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ 60వ సారి చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా, సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరం సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ తో ద్వైపాక్షిక చర్చల తర్వాత ఓవల్ ఆఫీస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయకపోతే అమెరికాతో వ్యాపారం ఆపేస్తానని బెదిరించినట్లు తెలిపారు. యుద్ధానికి పోతే.. 350 శాతం టారిఫ్ లు వేస్తానని చెప్పడంతోనే ప్రధాని నరేంద్ర మోదీ తనకు కాల్ చేసి, యుద్ధాన్ని ఆపేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా కాల్ చేసి థ్యాంక్స్ చెప్పారని గుర్తు చేశారు. ‘‘నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 8 యుద్ధాలు ఆపాను. వాటిలో 5 ట్రేడ్, టారిఫ్‌లతో భయపెట్టాను. ఈ 8 యుద్ధాల్లో ఇండియా, పాకిస్తాన్ ఎంతో ఇంపార్టెంట్. ఇది నా ఎకనామిక్ డిప్లొమసీ విజయం. కాగా, నైపుణ్యం ఉన్న వలసదారులను అమెరికా ఎప్పుడూ ఆహ్వానిస్తుందని ట్రంప్ ప్రకటించారు. చట్టబద్ధంగా వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
దొడ్డిదారిన అమెరికాలో అడుగుపెట్టాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నైపుణ్యం ఉండి అమెరికాకు మంచి చేయాలనుకునేవారిని ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక్కడ చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ ఇతరుల నైపుణ్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అమెరికాలోని వర్కర్లకు మిసైల్, చిప్స్ తయారీ వంటి కీలక అంశాల్లో టీచ్ చేయాలన్నారు. టెలిఫోన్లు, కంప్యూటర్ల తయారీలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నైపుణ్యం ఉన్నవాళ్లను దేశంలోని అనుమతించకపోతే అభివృద్ధి జరగదని తెలిపారు.
