ఇరాన్ ప్రెసిడెంట్కు మోదీ ఫోన్.. మౌలిక వసతులపై దాడులను ఖండించిన ప్రధాని

ఇరాన్ ప్రెసిడెంట్కు మోదీ ఫోన్.. మౌలిక వసతులపై దాడులను ఖండించిన ప్రధాని
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చర్చ


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్​తో ఫోన్‌‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. ఇరాన్​లోని కీలక మౌలిక వసతులపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇవి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రపంచ సరఫరా వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. 

ఈ కీలక సమయంలో నౌకా రవాణా మార్గాలు సేఫ్​గా కొనసాగడం అత్యంత కీలకమని చెప్పారు. ఇరాన్‌‌లో ఉన్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మోదీ అభినందించారు. ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెజెష్కియన్​తో మోదీ మాట్లాడడం ఇది రెండోసారి. 

చమురు రవాణాలో కీలక మార్గమైన హార్మూజ్ జలసంధిపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మార్గాన్ని ఇరాన్ తన కంట్రోల్​లోకి తీసుకుని ఇండియా సహా కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతిస్తోంది. యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వరుసగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేసియా దేశాల నాయకులతో మాట్లాడుతున్నారు. 

బహ్రెయిన్ రాజుతోనూ చర్చలు

ప్రధాని మోదీ శుక్రవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫాతోనూ ఫోన్​లో మాట్లాడారు.  ఈద్ శుభాకాంక్షలు తెలియజేసి పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. ఇంధన, ప్రజల మౌలిక వసతులపై జరుగుతున్న దాడులను ఖండించిన మోదీ.. అవి ప్రపంచ ఆహారం, ఇంధనం, ఎరువుల భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. బహ్రెయిన్‌‌లో భారతీయుల సంక్షేమానికి అందిస్తున్న సహకారంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు.