- ఓస్లో ఎయిర్‌పోర్టులో మోదీకి ఘనస్వాగతం పలికిన నార్వే ప్రధాని స్టోర్
- ఇరు దేశాల మధ్య బిజినెస్, పెట్టుబడులు, గ్రీన్ టెక్నాలజీ, బ్లూ ఎకానమీపై చర్చ
- నేడు నార్వే రాజు హరాల్డ్ వీ, రాణి సోంజాలతో భేటీ కానున్న మోదీ
ఓస్లో (నార్వే): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన గౌరవం దక్కింది. నార్వే దేశపు అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను అందుకున్నారు. అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడంలో, నార్వే ప్రయోజనాల కోసం విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రధాని మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల్లో ఇది 32వ గ్లోబల్ అవార్డు కావడం విశేషం.
స్వీడన్ పర్యటన ముగించుకుని రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఓస్లో చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ ఘనస్వాగతం పలికారు. గత 43 ఏండ్లలో ఒక భారత ప్రధాన మంత్రి నార్వేలో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీకి కూడా ఇదే మొదటి నార్వే పర్యటన. కాగా, అవార్డు ప్రధానోత్సవానికి ముందు ప్రధాని మోదీ, నార్వే ప్రధాని స్టోర్‌తో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, గ్రీన్ టెక్నాలజీ, బ్లూ ఎకానమీ (సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ) వంటి కీలక రంగాల్లో సహకారంపై వీరు ప్రధానంగా చర్చించారు.
నేడు 3వ నార్డిక్ -ఇండియా సమ్మిట్..
ఓస్లోలో మంగళవారం జరగనున్న ‘3వ నార్డిక్- ఇండియా సమ్మిట్’లో మోదీ, స్టోర్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానులు పాల్గొంటాయి. గతంలో 2018 (స్టాక్‌హోమ్), 2022 (కోపెన్‌హాగన్)లలో జరిగిన సదస్సుల కొనసాగింపుగా ఈ సదస్సు జరగనుంది. మరోవైపు, ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నార్వే రాజు హరాల్డ్ వీ, రాణి సోంజాలను మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. అలాగే, ‘ఇండియా -నార్వే బిజినెస్ అండ్ రీసెర్చ్ సమిట్’లో మోదీ ప్రసంగించనున్నారు.
ప్రపంచ భద్రతలో భారత్ పాత్ర కీలకం: నార్వే ప్రధాని
ప్రధాని మోదీ పర్యటనపై నార్వే ప్రధాని స్టోర్ ప్రశంసలు కురిపించారు. ‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వాతావరణ మార్పులు, సాంకేతికత, వాణిజ్యం, అంతర్జాతీయ భద్రత వంటి విషయాల్లో భారత్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో అంతర్జాతీయ సహకారాన్ని, నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థను పెంపొందించడంలో భారత్, నార్వే, నార్డిక్ దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయి”అని ఆయన పేర్కొన్నారు.
